
ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. షర్మిల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నిసార్లు పాదయాత్ర అనుమతి కోసం వస్తారని ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన కండిషన్లను ధిక్కరించి మాట్లాడుతోందని జీపీ కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను న్యాయస్థానానికి ఇచ్చారు. అయితే... ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై మాత్రమే షర్మిల స్పందించారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఒక మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహిస్తారా అని ప్రశ్నించింది. అసలు వ్యక్తులను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారని హైకోర్టు నిలదీసింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని షర్మిలకు సూచించింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని షర్మిల తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.