- చచ్చేలా కొడ్తరా?
- ఇది కచ్చితంగా సీబీఐకి అప్పగించాల్సిన కేసు
- మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టు సీరియస్
- డెడ్ బాడీపై దెబ్బలున్న విషయాన్ని ఎందుకు దాచారు?
- రీపోస్టుమార్టం చేయకుంటే మీ మాటలు నమ్మాల్సి వచ్చేది
- సీబీఐ, కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రాణం పోయేలా కొడతారా? ఇదేనా మానవత్వం? పైగా పరిహారం ఇచ్చామని గొప్పగా చెబుతున్నారు. పైసలు, నౌకరీలు ఇస్తే పోయిన ప్రాణం లేచి వస్తుందా” అంటూ రాష్ట్ర సర్కారుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వం చెప్పిన దానికి, రీపోస్టుమార్టానికి ఎంతో తేడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించాల్సిన కేసు అని చెప్పింది. అందుకే సీబీఐని ప్రతివాదిగా చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తున్నామని, సీబీఐతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇస్తున్నామని తెలిపింది.
ఈ నెల 22న జరిగే విచారణకు సీబీఐ ఎస్పీ హాజరయ్యేలా అదనపు సొలిసిటర్ జనరల్ నామారాపు రాజేశ్వర్‌రావు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ అదనపు సొలిసిటర్ జనరల్‌కు అడ్వొకేట్ జనరల్ అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని, లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబసభ్యులకు రూ.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కింద చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పౌరహక్కుల సంఘం (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
రీ పోర్టుమార్టం రిపోర్టు సర్కారుకు ఇవ్వలె
ఆలేరు మేజిస్ట్రేట్ ఇచ్చిన రిపోర్టు కాపీని మళ్లీ సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రీపోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలని రాష్ట్రం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ కోరగా.. అందుకు నిరాకరించింది. సీల్డ్ కవర్‌ను భద్రంగా ఉంచాలని కోర్టు స్టాఫ్‌కు ఉత్తర్వులిచ్చింది. మరియమ్మ మృతి ఘటనకు బాధ్యులైన ఎస్సై, కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి తొలగించామని ఏజీ చెప్పడంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించేస్తే నేరం సంగతేంటి? క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న చట్ట నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదు? మరియమ్మ ఫ్యామిలీ మెంబర్స్‌కు రూ.15 లక్షలు, కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే పోయిన ప్రాణం లేచి వస్తుందా? మరియమ్మ మృతికి కారణమైన, ఆమె శరీరంపై గాయాలకు కారణమైన వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదంటే ఏమనుకోవాలి? సర్కారీ పోస్టుమార్టం రిపోర్టులో మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నట్లుగా ఎందుకు చెప్పలేదు. ఆమెను చచ్చేదాకా కొట్టారని మేజిస్ట్రేట్ రిపోర్టు చూస్తే అర్థం అవుతోంది. మీరే (ఏజీ) ఫొటోలు చూడండి తెలుస్తుంది” అంటూ ఫైర్ అయింది. ఏజీ తన వాదనలు వాదిస్తూ.. మరియమ్మకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, గుండె పోటు వల్ల చనిపోయిందని, కొట్టడం వల్ల చనిపోలేదని తెలిపారు. ఈ వాదనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘మేమే కనుక రీపోస్టుమార్టానికి ఆదేశాలు ఇవ్వకపోయింటే.. మరియమ్మ అనారోగ్యంతో, గుండెపోటుతో చనిపోయినట్లు భావించాల్సి వచ్చేది. పోలీసుల కస్టడీలో ఎంతగా కొట్టారో చూడండి. ప్రాణాలు పోయేలా కొడతారా? ఎంతగా కొడితే గుండె ఆగిపోతుంది’’ అని నిలదీసింది.
