- పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: అవుట్‌డోర్ ప్రకటనల విధానంపై హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. తమ వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకొని, కొత్త ప్రకటనల విధానం రూపొందించాలంటూ ఫిబ్రవరిలో జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్, మరో మూడు ప్రకటనల సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అవుట్‌డోర్ ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను సవాల్‌చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి కొత్త విధానాన్ని ప్రకటించాలని కోర్టు ఆదేశించిందన్నారు. కానీ, ప్రభుత్వం ఏకపక్షంగా కొత్త విధానం తీసుకొచ్చి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు.
