
బిగ్బాస్ షో వివాదం మరింత వేడెక్కుతుంది. బిగ్‌బాస్ షో అనేది క్రైమ్ అని..ఇదొక అరాచకం అని వెంటనే నిర్బహకులపై, నాగార్జునపై యాక్షన్ తీసుకోవాలని సీపీఐ నారాయణ ఇదివరకే సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బిగ్బాస్ రియాలిటీ షోపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు..హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్.
ఈ పిటిషన్లో ఏముందంటే:
బిగ్బాస్ షో వల్ల ప్రజలపై రెచ్చగొట్టే ప్రభావం జరిగిందని తెలిపారు అడ్వకేట్ అరుణ్ కుమార్. ఈ షో పేరిట కొందరు సోషల్ మీడియా వ్యక్తులను అక్రమంగా 100 రోజుల పాటు నిర్బంధించడంపై..ఈ బిగ్బాస్ నిర్వహకుడు నాగార్జునని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అంతేకాకుండా బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన వీరంగం అంతా ఇంతా కాదని..అందుకు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు.
అంతేకాకుండా బిగ్బాస్ (Bigg Boss Show) షో ముగింపు సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంలో..దాని వెనుక ఉన్న కుట్ర బయటికి తీయాలని కోరారు. జరిగిన ఈ విధ్వంసలో ప్రభుత్వ ఆస్తులైన 8 RTC బస్సులతో పాటు కార్లు, అక్కడ ఉన్న కొంతమందికి గాయాలు అయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఈ గొడవకు సంబంధించి వివిధ కేసులు నమోదవ్వగా..అసలైన వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో..ఆ బాధ్యతని నాగార్జున తీసుకోవాలని..ముందుగా అతన్ని అరెస్ట్ చేయాలనీ..అలాగే బిగ్బాస్ హౌస్లో పాల్గోన్న కంటెస్టెంట్ల అందర్నీవిచారించాలని..ఇందుకు హైకోర్టుకు లేఖ కూడా రాసినట్లు అరుణ్ కుమార్ వెల్లడించారు.