గ్రూప్1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దండి.. వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి: హైకోర్టు

గ్రూప్1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దండి.. వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి: హైకోర్టు
  • 8 నెలల్లో ప్రక్రియను పూర్తి చేయండి
  • అది సాధ్యం కాకుంటే మళ్లీ పరీక్షలు నిర్వహించండి
  • ప్రిలిమ్స్​రాసినోళ్లందరినీ ఎగ్జామ్స్‌‌కు అనుమతించండి
  • జనరల్‌‌ ర్యాంకింగ్​ లిస్ట్‌‌ రద్దు చేస్తూ తీర్పు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌–-1 మూల్యాంకనం, ర్యాంకింగ్‌‌ లిస్ట్‌‌పై  హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్‌‌ ర్యాంకింగ్‌‌ లిస్ట్‌‌ (జీఆర్‌‌‌‌ఎల్‌‌), మార్కుల జాబితాను రద్దు చేసింది. సంజయ్‌‌ వర్సెస్‌‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మళ్లీ పేపర్లను దిద్దాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.  వాటి ఆధారంగా 563 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ అది సాధ్యంకాకపోతే మెయిన్స్ పరీక్షలను  రద్దు చేసి, ప్రిలిమ్స్‌‌లో అర్హత సాధించినవారందరికీ మళ్లీ ఎగ్జామ్స్​ నిర్వహించాలని ఆదేశించింది.

గ్రూప్‌‌‌‌‌‌‌‌-–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ, వాటిని రద్దు చేయరాదంటూ దాఖలైన దాదాపు 12 పిటిషన్లపై విచారించిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం 222 పేజీల తీర్పును వెలువరించారు. గతంలో పరీక్షలను రద్దు చేసినా కమిషన్‌‌‌‌‌‌‌‌ గుణపాఠాలు నేర్చుకోలేదని అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత కొనసాగించలేదని పేర్కొన్నారు.  సొంత నియమ, నిబంధనలను ఉల్లంఘించడాన్ని తప్పుబట్టారు. కమిషన్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నిరుద్యోగ యువత నష్టపోయిందని అన్నారు. ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేసి రోజుకు 10 నుంచి 12 గంటలపాటు కష్టపడి చదువుకున్నారని, కమిషన్‌‌‌‌‌‌‌‌ విధానపరమైన, మూల్యాంకన విధానం అమలు చేయడంలో విఫలమైందని, ఈ నిర్లక్ష్యాన్ని అనుమతించలేమని చెప్పారు.
 
వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌లో లోపాలు
మూల్యాంకనం సరైన విధానంలో చేయలేదని, మోడరేషన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అనుసరించలేదని జడ్జి పేర్కొన్నారు. కమిషన్‌‌‌‌‌‌‌‌ పరస్పర విరుద్ధమైన వైఖరిని వెల్లడించిందని చెప్పారు. ‘‘వాల్యూయేషన్​ చేసినోళ్లందరూ ఇంగ్లిష్​, తెలుగు మీడియం జవాబు పత్రాల మూల్యాంకనంలో నిపుణులే. కమిషన్‌‌‌‌‌‌‌‌ చర్యను పరిశీలిస్తే వాల్యూయేషన్‌‌‌‌‌‌‌‌లో సరైన పద్ధతిని అనుసరించలేదని తెలుస్తున్నది. పరీక్షల మూల్యాంకనంలో ఒక పద్ధతి, ప్రామాణికత, ఏకరీతి మూల్యాంకన విధానాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది” అని అన్నారు.

అసమానతలతో, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేలా ఏకపక్ష మూల్యాంకనం చెల్లదని తేల్చి చెప్పారు.  పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం రెండు హాల్‌‌‌‌‌‌‌‌టిటికెట్ల విధానాన్ని అమలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు.. డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జారీ చేసిన నిబంధనల్లో రెండు హాల్‌‌‌‌‌‌‌‌టికెట్ల జారీకి సంబంధించి ఎక్కడా లేదన్నారు. పరీక్షల నిర్వహణపై కమిషన్‌‌‌‌‌‌‌‌ చర్య సందేహాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.

పారదర్శకమైన విధానంతో సెంటర్ల కేటాయింపు జరిగిందని చెబుతున్నా.. వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు.  ర్యాండమైజేషన్‌‌‌‌‌‌‌‌ పద్ధతిని ఉపయోగించినట్లయితే కేవలం రెండు కేంద్రాల్లోనే మహిళా అభ్యర్థులను ఎందుకు కేటాయించారన్న ప్రశ్న వస్తుందని, అందువల్ల కమిషన్‌‌‌‌‌‌‌‌ చర్య ర్యాండమైజేషన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని వక్రీకరించిందని తెలిపారు. పరీక్షకు హాజరైనవారి సంఖ్యను పలు సందర్భాల్లో పలు రకాలుగా వెల్లడించిందన్నారు. కమిషన్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు.