తుది తీర్పునకు లోబడే నిధుల మళ్లింపు : హైకోర్టు

తుది తీర్పునకు లోబడే నిధుల మళ్లింపు : హైకోర్టు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్ల రాయితీ సొమ్ము మళ్లింపు తుది తీర్పునకు లోబడే ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.   ప్రాథమిక అంచనా రాయితీ విలువను ప్రకటించకుండా ఓఆర్‌ఆర్‌ నిర్వహణ, టోల్‌ వసూళ్లకు సంబంధించి హెచ్‌ఎండీఏ.. ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వేతో మే 28న రూ.7,380 కోట్లకు 30 ఏళ్లపాటు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్య రాయితీ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌కుమార్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. 

హెచ్‌ఎండీఏ నుంచి మళ్లించిన నిధులను ప్రభుత్వం ఖర్చు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ప్రతివాదన చేస్తూ.. హెచ్‌ఎండీఏ వేరే గ్రహానికి చెందిన సంస్థ కాదని, అది ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నదని తెలిపారు. 

ఓఆర్‌ఆర్‌ టో ల్‌ రెవెన్యూ మొత్తం ప్రభుత్వానికే చెందుతుందని, టోల్‌ వసూలు చేసే బాధ్యత మాత్రమే హెచ్‌ఎండీఏదని వివరించారు. దీనిపై సమగ్ర వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరారు.  దీంతో అక్టోబర్‌ 10న పూర్తిస్థాయి వాదనలు వింటామని హైకోర్టు ప్రకటించింది.