అవసరమైతే కోకాపేట భూముల వేలం ఆపేస్తం

అవసరమైతే కోకాపేట భూముల వేలం ఆపేస్తం
  • కోకాపేటలో లేని అభ్యంతరం.. వట్టినాగులపల్లి భూములకెందుకు: హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: కోకాపేట ఏరియాలో లేని అభ్యంతరం వట్టినాగులపల్లి భూముల విషయంలో ఎందుకని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వ  ద్వంద్వ వైఖరిని ఉపేక్షించబోమని, అవసరమైతే కోకాపేట భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. వట్టినాగులపల్లిలోని తమ భూముల సర్వే నంబర్లను జీవో111 పరిధి నుంచి తొలగించాలని కోరుతూ అగ్ని అగ్రిటెక్‌‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌‌ను సోమవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది. హిమాయత్‌‌సాగర్, హుస్మాన్‌‌సాగర్‌‌ జంట జలాశయాల క్యాచ్‌‌మెంట్‌‌ ఏరియాల్లోని 80 గ్రామాల్లో ఒకటైన వట్టినాగులపల్లిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతి ఇస్తే ఆ జలాశయాలు, వాటి పరీవాహక ప్రాంతాలు దెబ్బతింటాయని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌‌లో పేర్కొనడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వట్టినాగులపల్లికి సమీపంలోని కోకాపేట భూములను ప్రభుత్వం వేలం వేసి రూ.2 వేల కోట్లు ఆర్జించిందని, అక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలకు యోగ్యమని కోకాపేట ల్యాండ్స్‌‌పై దాఖలైన పిల్‌‌లో ప్రభుత్వం పేర్కొందని, కోకాపేట ఏరియాలో లేని అభ్యంతరం వట్టినాగులపల్లి ల్యాండ్స్‌‌ విషయంలో ఎందుకని  నిలదీసింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఉపేక్షించబోమని, అవసరమైతే కోకాపేట పిల్‌‌తో వట్టినాగులపల్లి రిట్‌‌ పిటిషన్లను జత చేసి విచారిస్తామని హెచ్చరించింది. జీవో 111 కింద నిర్మాణాలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిషేధం ఉందని, జంట జలాశయాల రక్షణకు చర్యల్లో భాగంగానే జీవో జారీ అయిందని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ న్యాయవాది ముకుల్‌‌ రోహత్గీ వాదించారు. కోకాపేట భూముల కేసుల పిల్‌‌లో ఈ విషయాలు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని కోర్టు తప్పుపట్టింది. కోకాపేటలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే జలాశయాలు పాడవ్వవా, పరీవాహక ప్రాంతాల వెలుపల ఉన్న వట్టినాగులపల్లిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తేనే రిజర్వాయర్లు కలుషితం అవుతాయా అంటూ నిప్పులు చెరిగింది.

వట్టినాగులపల్లి ల్యాండ్స్‌‌ ఉస్మాన్‌‌సాగర్, హిమాయత్‌‌సాగర్‌‌ రిజర్వాయర్ల క్యాచ్‌‌మెంట్‌‌ ఏరియాలో లేవని ఒక కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఘాటు వ్యాఖ్య చేసింది. కమిటీ నివేదిక మేరకు తమ భూములను జీవో పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని అగ్ని అగ్రిటెక్‌‌ తరఫు సీనియర్‌‌ న్యాయవాది కె.వివేక్‌‌రెడ్డి కోర్టును కోరారు. జీవో 111 నుంచి వట్టినాగులపల్లిలోని ప్రైవేట్‌‌ ల్యాండ్స్‌‌ తొలగించాలన్న పిటిషనర్ల వాదనను వ్యతిరేకిస్తూ రోహత్గీ వాదించినప్పటికీ హైకోర్టు ఒప్పుకోలేదు. చీఫ్‌‌ సెక్రటరీ నేతృత్వంలో ప్రభుత్వం 4 ఏండ్ల 7 నెలల క్రితం నియమించిన హైలెవల్‌‌ కమిటీ తన నివేదికను ఇప్పటివరకు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. విచారణను వాయిదా వేస్తే వివరాలతో  మళ్లీ అఫిడవిట్‌‌ దాఖలు చేస్తామని రోహత్గీ కోరారు. ఈ నెల 18న తిరిగి విచారణ చేస్తామని, ఇరుపక్షాలు వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు సూచించింది.