లిక్కర్​ షాపుల రిజర్వేషన్లు బీసీల్లో గౌడ్స్​కే ఎట్లిస్తరు?

లిక్కర్​ షాపుల రిజర్వేషన్లు బీసీల్లో గౌడ్స్​కే ఎట్లిస్తరు?
  • హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది
  • మద్యం రిజర్వేషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: బీసీల్లో ఒక్క గౌడ కులస్తులకు మాత్రమే లిక్కర్‌‌ షాపుల్లో రిజర్వేషన్లు ఎలా ఇస్తారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీ రమణ హైకోర్టులో వాదించారు. గౌడ్స్​ సామాజికంగా, ఆర్థికంగా నిరుపేదలని నిర్ణయించేందుకు ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయలేదన్నారు. బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించి అమలు చేస్తోంటే ఒక్క గౌడ కులస్తులకు మాత్రమే రిజర్వేషన్​ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కాగా మద్యం షాపుల రిజర్వేషన్ల కేటాయింపుపై  దాఖలైన పిటిషన్ల వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. మద్యం షాపుల్లో గౌడ్స్​కు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ శుక్రవారం కేసు విచారణ చేపట్టారు. అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ స్పందిస్తూ.. గౌడ కులస్తులు కులాచారం ప్రకారం కల్లు వ్యాపారంలో ఉన్నారని, కల్లుగీత చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారిలో చాలా మంది మద్యం వ్యాపారంలోకి వస్తున్నందున వారి సంక్షేమం కోసం ప్రభుత్వం 15 శాతం షాపుల్ని కేటాయించినట్లు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నందున మద్యం షాపుల కేటాయింపుల్లో వారికి రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీ రమణ వాదిస్తూ.. గౌడ కులస్తులు సామాజిక, ఆర్థిక నిరుపేదలని నిర్ణయించేందుకు ప్రభుత్వం శాస్త్రీయంగా ఎలాంటి కసరత్తు చేయలేదన్నారు. వారి వెనకబాటుతనంపై ప్రభుత్వం సేకరించిన వివరాలు ఏమిటో కూడా తెలియదన్నారు. మద్యం షాపుల రిజర్వేషన్లు అశాస్త్రీయంగా ఉన్నాయని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది.