కోర్టులంటే లెక్కలేనట్లుంది ..హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

కోర్టులంటే లెక్కలేనట్లుంది ..హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్‌  ఏవీ రంగనాథ్‌ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట పరిధిలోని ప్రైవేటు స్థల వివాదంపై యథాతథస్థితి కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వుల ఉల్లంఘనల విషయంలో కోర్టుకు రంగనాథ్  హాజరు కాలేదు. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా రంగనాథ్ కు లెక్కలేనట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

 ఆయన కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ను ఖాతరు చేయడం లేదని, ఏమాత్రం గౌరవం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. డిసెంబరు 5న హాజరు కావాలని, కాకపోతే నాన్‌బెయిల్‌బుల్‌ వారంట్‌  జారీ చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

 బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని, స్థలంలో ఎలాంటి   మార్పులూ చేయరాదంటూ జూన్‌ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎ.సుధాకర్‌ రెడ్డి.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌  దాఖలు చేశారు. దీనిపై అక్టోబరు 31న విచారించిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబరు 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించింది.

 అయితే, బాచుపల్లిలో అత్యవసరమైన పనులు చేపట్టాల్సి ఉన్నందున హాజరుకాలేకపోతున్నానని, హాజరు మినహాయింపు కోరుతూ రంగనాథ్‌  మధ్యంతర పిటిషన్‌  దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌  మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌  బీఆర్‌ మధుసూదన్‌రావుతో కూడిన బెంచ్‌  గురువారం విచారణ చేపట్టింది. హాజరు మినహాయింపుకు నిరాకరిస్తూ కమిషనర్‌  దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది.