హైకోర్ట్ ఆగ్రహం : సీఎం కేసీఆర్ తీరు పిలుపులా లేదు..బెదిరింపులా ఉంది

హైకోర్ట్ ఆగ్రహం : సీఎం కేసీఆర్ తీరు పిలుపులా లేదు..బెదిరింపులా ఉంది

డ్యూటీలో చేరాలంటూ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన డెడ్​లైన్​పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం తీరు పిలుపులా లేదని, బెదిరింపులా ఉందని వ్యాఖ్యానించింది. కార్మికులు, యూనియన్లపై సర్కార్​ బెదిరింపులకు దిగుతోందని, షరతులు విధిస్తూ డ్యూటీలో చేరాలని ఒత్తిడి తెస్తోందని యూనియన్ల తరఫు సీనియర్‌‌ లాయర్‌‌ డి.ప్రకాశ్​రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. యూనియన్లతో చర్చలు చేపట్టడంలేదని అన్నారు. వెంటనే సీఎస్‌‌ ఎస్కే జోషి కల్పించుకుని.. సీఎం కూడా కార్మికులను డ్యూటీలో చేరాలని విజ్ఞప్తి చేశారని,3 దఫాలుగా చర్చలకు పిలిచారని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. పై విధంగా వ్యాఖ్యానించింది.

రాష్ట్రానికి పాలకుడు తండ్రయితే.. ప్రజలు పిల్లలు. ఆర్టీసీ విషయంలో  పాలకుడు పెద్ద మనసు చేసుకోవాలి. మా అమ్మ 13 పిల్లలనే కాకుండా మరో పది మందిని కూడా పెంచింది. పిల్లలందరికీ అన్నం పెట్టి తాను గంజి తాగేది. అదే అమ్మ గొప్పదనం.  ఆర్టీసీ అంటే 48 వేల మంది ఉద్యోగులు మాత్రమే కాదు. అది తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల సమస్య.  ప్రజల సమస్యలు పట్టకపోతే ఎట్ల?

– చీఫ్​ జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీకి బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ, జీహెచ్​ఎంసీ చెబుతున్న లెక్కలు మళ్లీ తప్పుల తడకగా ఉన్నాయని, కోర్టులంటే లెక్క లేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్​ అధికారులు ఇలాంటి నివేదికలను తయారుచేయడం తాము ఎన్నడూ చూడలేదని, సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు, లాజికల్‌‌ పదాలు వాడారని నిప్పులు చెరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసేలా  ఉందని వ్యాఖ్యానించింది. డ్యూటీలో చేరాలంటూ కార్మికులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన డెడ్​లైన్​పై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె విరమించేలా చూడాలంటూ ఓయూ రీసెర్చ్‌‌ స్కాలర్‌‌ సుబేందర్‌‌సింగ్‌‌ దాఖలు చేసిన పిల్​మరోసారి గురువారం హైకోర్టు చీఫ్​ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ముందు విచారణకు వచ్చింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ సునీల్​ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టు ముందు హాజరయ్యారు. సుమారు 3గంటల పాటు విచారణ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ  మేనేజ్​మెంట్, జీహెచ్​ఎంసీ ఇచ్చిన అఫిడవిట్లపైనే రెండు గంటలపాటు డివిజన్​ బెంచ్​ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నివేదికలపై సీఎస్​ ఎస్కే జోషి నుంచి  వివరణ తీసుకుంది. అసలు ఏపీఎస్​ఆర్టీసీ విభజన జరగలేదని, అలాంటప్పుడు టీఎస్ ​ఆర్టీసీకి చట్టబద్ధత లేదని హైకోర్టు దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

క్షమాపణ చెప్పడమే సమాధానమా?

ఆర్థిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని డివిజన్‌‌ బెంచ్‌‌ తప్పుపట్టింది. కావాలని ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సివస్తుందని హెచ్చరించింది. ‘ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారంగా చర్యలు తీసుకోవాల్సివస్తుందనే విషయం మీకు తెలుసా’ అని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ప్రశ్నించింది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ‘‘అంటే మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా?” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కువ సమయంలో తమ ఆఫీసులో  ఉన్న రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని, తమను క్షమించాలని రామకృష్ణారావు కోరారు. దీనిపై డివిజన్​ బెంచ్​ స్పందిస్తూ.. ‘‘క్షమాపణ చెప్పడం.. సమాధానం కాదు” అని మందలించింది. కోర్టులకు వాస్తవాలు చెప్పాలన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించింది. ఐఏఎస్‌‌ స్థాయి అధికారులే  ఇలాంటి నివేదికలు ఇచ్చారంటే అది కోర్టుల పట్ల నిర్లక్ష్య ధోరణి అనుకోవాలా.. అని ఘాటుగా వ్యాఖ్యానించింది. రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నివేదిక ఇస్తున్నట్లు ఇప్పుడు చెబుతున్నారంటే.. తొలి నివేదికను పరిశీలించకుండానే ఎలా ఇచ్చారని నిలదీసింది. మరోసారి రామకృష్ణారావు జరిగిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. రుణ పద్దుల కింది కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఆర్థికశాఖ, ఆర్టీసీ నివేదికల్లో అంకెలు వేర్వేరుగా ఉన్నాయని, ఇందులో వేటిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషిని డివిజన్‌‌ బెంచ్‌‌ ప్రశ్నించింది. సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు, లాజికల్‌‌ పదాలు వాడారని వ్యాఖ్యానించింది.

మా స్థానంలో కూర్చుంటే తెలుస్తది?

ఆర్టీసీకి తాము నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని జీహెచ్​ఎంసీ చెప్తున్నప్పుడు.. నిధుల కోసం దాన్ని ఎందుకు అడుగుతున్నారని హైకోర్టు  ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖ.. ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని  వ్యాఖ్యానించింది. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని మండిపడింది. ‘‘మీరు 5 నిమిషాలు మా స్థానంలో ఉండి మీ నివేదికలు చూడండి. మీరు చెప్పే మాటలు, నివేదికలు నమ్మే విధంగా ఉన్నాయా?” అని డివిజన్​ బెంచ్​ వ్యాఖ్యానించింది.

మా పిల్లల్ని తెప్పించేందుకూ బస్సుల్లేవ్

‘‘ఆర్టీసీ సమ్మె వల్ల రాష్ట్రంలో పేద ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రజల విషయంలో బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. దీనిపై సర్కార్‌‌ మరోసారి సానుకూలంగా ఆలోచించాలి” అని హైకోర్టు సూచించింది. ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్జీల పిల్లలకు పోటీలు నిర్వహిద్దామనుకుంటే  ‘బస్సులు లేవు.. పిల్లల్ని తీసుకురాలేం’ అని వారు సమాచారం ఇచ్చారని డివిజన్​ బెంచ్‌‌  పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తున్నా.. ప్రభుత్వం, కార్మిక సంఘాల వైఖరి వల్ల సమస్య కొలిక్కిరావడం లేదని తెలిపింది. ఆర్టీసీ ఇష్యూ లో ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించింది. మరోసారి సర్కార్‌‌ సానుకూల వైఖరితో వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. విచారణను 11కు వాయిదా వేసింది. 5,100 రూట్లను ప్రైవేట్​కు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్​ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిల్​ను శుక్రవారం విచారిస్తామంది.

మీ బాస్కే తప్పులు చెప్తే.. మరి మాకు..?

ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై గతంలో రవాణా మంత్రికి తప్పుడు సమాచారం అందజేశామని అఫిడవిట్​లో ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ సునీల్​శర్మ పేర్కొనడంపై హైకోర్టు సీరియస్​ అయింది. ‘‘మంత్రికి తప్పుడు లెక్కలిస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లు కాదా? మంత్రిని తప్పు దోవ పట్టించినట్లు అంగీకరించడం ఆశ్చర్యం” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇలాంటి సమాచారంతో సీఎం, కేబినెట్, రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నా రా? మీరు రవాణా మంత్రితోనూ అసెంబ్లీ వేదికలాగా తప్పుడు లెక్కలు చెప్పించారు. మీ బాస్​నే తప్పుదోవ పట్టించారు. మాకు నిజాలు చెబుతున్నారని ఎలా నమ్మాలి” అని శర్మను ప్రశ్నిం చింది. ‘‘అసెంబ్లీ ఇన్ఫర్మేషన్ సరైందయితే హైకోర్టులో మీరు వేసిన అఫిడవిట్ తప్పుదవు తుంది. లేదంటే అసెంబ్లీ వేదికగా ప్రజలకు తప్పులు చెప్పించినట్లేగా” అన్నది. తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీని ఎందుకు కొనసాగిసస్తున్నారో అర్థం కావడం లేదంది.