జీవో 151 అమలుపై హైకోర్టు స్టే

జీవో 151 అమలుపై హైకోర్టు స్టే
  • ‘సెస్’ పాలకవర్గం పొడిగింపుపై సర్కారుకు ఎదురుదెబ్బ 

హైదరాబాద్, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ సొసైటీ (సెస్) పాలకవర్గం గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 151 అమలును హైకోర్టు నిలిపివేసింది. పాలకవర్గం గడువు పొడిగింపు ఉత్తర్వులు కోఆపరేటివ్‌‌‌‌ సొసైటీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. మూడు లక్షల మంది సభ్యులు ఉన్న సొసైటీ పాలకవర్గ కమిటీ గడువు ముగిసిపోతే ఎన్నికలు నిర్వహించకుండా పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమమంటూ సొసైటీ మెంబర్‌‌‌‌ కనకయ్య వేసిన రిట్‌‌‌‌ను బుధవారం హైకోర్టు విచారించింది. దీంతో జీవో అమలును నిలిపివేస్తూ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీష్‌‌‌‌ చంద్రశర్మ, జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలితో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సొసైటీకి స్పెషల్ ఆఫీసర్‌‌‌‌ను నియమించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందని పిటిషనర్‌‌‌‌ న్యాయవాది వివేక్‌‌‌‌రెడ్డి చెప్పారు. చట్టాన్ని సవరించి పాలకవర్గ గడువును పెంచడం చెల్లదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రారావు వాదించారు. గడువు ముగిసిన తర్వాత పాలకవర్గాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. కరోనా కారణంగా ఓటర్ల లిస్ట్‌‌‌‌ రెడీ కానందువల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయని, అందుకే పాలకవర్గాన్ని పొడిగించాల్సి వచ్చిందన్నారు. వాదనలు విన్న తర్వాత జీవో 151 అమలును నిలిపివేస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.