మోడల్‌‌ స్కూళ్లలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే

మోడల్‌‌ స్కూళ్లలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్‌‌ స్కూళ్లలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై సోమవారం హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర విద్యాశాఖ, విద్యాశాఖ డైరెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన మెమోలను సోమవారం హైకోర్టు నిలిపివేస్తూ  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మోడల్‌‌ స్కూళ్ల సెకండరీ ఎడ్యుకేషన్‌‌ సొసైటీలో పనిచేస్తున్నవారిని కొత్త జోనల్‌‌ కేడర్‌‌లుగా విభజించి కేటాయించాలన్న విద్యాశాఖ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోస్టు గ్రాడ్యుయేట్‌‌ టీచర్లు (పీజీటీ)లు హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. 

దీనిని జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌ నందికొండ నర్సింగ్‌‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి విద్యాశాఖ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.