జూబ్లీహిల్స్‌ రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే

జూబ్లీహిల్స్‌ రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే
  • భూసేకరణలో జీహెచ్‌ఎంసీ తీరుపై అసహనం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టులో  చుక్కెదురైంది. రోడ్డు నెం.45–టి జంక్షన్‌ నుంచి దుర్గంచెరువు వరకు రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ ప్రాసెస్ పై  స్టే విధించింది. భూసేకరణలో జీహెచ్‌ఎంసీ అధికారులు అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రోడ్డును 80 అడుగుల నుంచి 120 అడుగుల వరకు విస్తరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 

ఈ విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న 4 ప్రైవేటు ఆస్తులను అధికారులు 'ప్రభుత్వ భూములు'గా రికార్డుల్లో చూపిస్తూ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అవి తమ పట్టా భూములని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ సి.వి. నరసింహం, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ విచారించారు. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ..ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వ భూములుగా ఎలా పేర్కొంటారు? దానికి తగిన ఆధారాలు ఎక్కడ? అని అధికారులను ప్రశ్నించింది. 

బాధితులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వాటిని పరిష్కరించకుండానే జనవరి 25న నోటీసులు ఇవ్వడం చట్టబద్ధం కాదని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం భూసేకరణ జరిగిందా లేదా అన్నది తేలే వరకు యజమానులను బలవంతంగా ఖాళీ చేయించవద్దని స్పష్టం చేసింది. విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.