స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై స్టేకు నిరాకరణ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై స్టేకు నిరాకరణ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు
  • విచారణ నేటికి వాయిదా
  • బీసీ జనాభాకు న్యాయం చేయాలన్నదేమా ఉద్దేశం: ప్రభుత్వం
  • గవాలి కేసులో సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులకు తగ్గట్టుగానే రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాం
  • డెడికేటెడ్​ కమిషన్​ వేసి.. సర్వే చేయించి.. సమగ్రంగా చర్చించాకే అసెంబ్లీలో బిల్లు పాసైనట్లు వెల్లడి
  • జీవో 9కి చట్టబద్ధత లేదని వాదించిన పిటిషనర్లు
  • ఎన్నికల నోటిఫికేషన్​ ఇవ్వకుండా అడ్డుకోవాలని వినతి.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని కోర్టు

హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ జారీని అడ్డుకోవాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. స్టే ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. లోకల్​ బాడీ ఎలక్షన్స్​లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పటికే ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ను ప్రకటించింది. గురువారం నోటిఫికేషన్​ ఇవ్వనుంది. అయితే.. నోటిఫికేషన్​పై స్టే ఇవ్వాలంటూ పిటిషనర్లు విచారణ సందర్భంగా కోర్టును అభ్యర్థించారు. దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా.. బీసీ రిజర్వేషన్లపై విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మాసనం వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌‌‌ అడ్వకేట్​అభిషేక్‌‌‌‌ మను సింఘ్వీ, అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.సుదర్శన్‌‌‌‌రెడ్డి విచారణకు హాజరై.. వాదనలు వినిపించారు.

42 % బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాల్​ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్​ పిటిషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాకే 42 % రిజర్వేషన్ల అమలుతో ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ వికారాబాద్‌‌‌‌ జిల్లా ధరూర్‌‌‌‌ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌‌‌‌.లక్ష్మయ్య, హైదరాబాద్‌‌‌‌ బాగ్‌‌‌‌లింగంపల్లికి చెందిన న్యాయవాది శాంతప్ప కూడా పిటిషన్లు వేశారు. ఈ కేసుల్లో తమ వాదనలు వినాలని కోరుతూ పలు ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జి. ఎం. మొహియుద్దీన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సుమారు ఐదు గంటలపాటు వాదనలు సాగాయి. తుది విచారణ సమయంలో ఇంప్లీడ్​ పిటిషన్లపై వాదనలు వింటామని ధర్మాసనం ప్రకటించింది.

బీసీలకు న్యాయమే ప్రభుత్వ ఉద్దేశం: సింఘ్వీ
ప్రభుత్వం తరఫున సు  ప్రీంకోర్టు సీనియర్‌‌‌‌ అడ్వకేట్​ అభిషేక్‌‌‌‌ మను సింఘ్వీ తొలుత వాదనలు వినిపించారు. ‘‘రాష్ట్ర శానసనసభ బిల్లును ఆమోదించి గవర్నర్‌‌‌‌కు గత మార్చిలో పంపితే ఇప్పటి వరకు ఆమోదం చెప్పలేదు. ప్రజలు ఎన్నుకున్న సీఎం ప్రజల కోసం ముఖ్యంగా వెనుకబడిన ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పనకు జీవో వెలువడింది. గవర్నర్‌‌‌‌ తన అధికారాలను వినియోగించి బిల్లుకు ఆమోదం చెప్పడమో లేదో బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపడమో చేయాలి. కానీ, ఏమీ చేయకుండా పెట్టుకుని ఉంటే ప్రభుత్వం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. గవర్నర్‌‌‌‌ నియామకం ద్వారా అధికారంలో ఉంటారు” అని ఆయన తెలిపారు. బీసీ జనాభా పెరిగిన నేపథ్యంలో వారికి న్యాయం చేయాలనే కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌‌‌‌ అధికారి నేతృత్వంలో డెడికేటెడ్‌‌‌‌ కమిషన్‌‌‌‌ను నియమించిందని, ఇంటింటికీ కమిషన్‌‌‌‌ సర్వే చేసి జనంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసి శాస్త్రీయంగా నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.

బీసీ జనాభా 56 శాతానికిపైగా ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్‌‌‌‌ సిఫార్సు చేసిందని.. ఈ వ్యవహారాలన్నింటిపైన అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాక అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో 9ని తెచ్చిందన్నారు. ఈ  జీవోను అడ్డుకునేందుకు దాఖలైన పిటిషన్లలో స్టే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని ఆయన కోర్టుకు విన్నవించారు. కౌంటర్లు దాఖలు చేశాక, సమగ్ర విచారణ పూర్తి చేశాకే కోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. బీసీలకు స్థానిక సంస్థల పదవుల్లో రిజర్వేషన్లు పెరిగితే పాలనాపరంగానే కాకుండా విద్య, ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలు కూడా అందిపుచ్చుకుంటారని ఆయన తెలియజేశారు. 

కోర్టు సమయం ముగిసిపోయి సాయంత్రం 4.50 గంటలప్పుడు ఏజీ సుదర్శన్‌‌‌‌రెడ్డి కల్పించుకుని విచారణను గురవారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ వెలువడే అవకాశం ఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.  అయితే.. కోర్టు మాత్రం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయలేదు. కిక్కిరిసిన కోర్టులో ఇరుపక్షాల వాదనల అనంతరం విచారణను గురువారం మధ్యాహ్నానికి ధర్మాసనం వాయిదా వేసింది. 

జీవో 9కి చట్టబద్ధత లేదు: పిటిషనర్లు
పిటిషనర్ల తరఫున సీనియర్‌‌‌‌  అడ్వకేట్లు జె.ప్రభాకర్, కె.వివేక్‌‌‌‌రెడ్డి, మయూర్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9కి చట్టబద్ధత లేదన్నారు. శాసనసభలో తీర్మానం చేసిన బిల్లుకు గవర్నర్‌‌‌‌ ఆమోదం పొందకుండానే ప్రభుత్వం జీవో జారీ చేయడం చెల్లదని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా రిజర్వేషన్ల పరిధిని ఎత్తివేస్తూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించిందన్నారు. ఈ బిల్లును గవర్నర్‌‌‌‌ ఆమోదించాల్సి ఉందని తెలిపారు. గవర్నర్‌‌‌‌ ఆమోదించకుండానే అంటే బిల్లుకు చట్టబద్ధత లేకుండానే.. అందులోని అంశాలకు అనుగుణంగా జీవో 9ని జారీ చేయడం కరెక్ట్​ కాదని, అది చెల్లదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇందిరాసహానీ, కృష్ణమూర్తి, తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ల కల్పనపై వెలువరించిన తీర్పుల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని,  చట్టం కాకుండానే జీవో ఇచ్చిందని వారు వాదించారు. సొంత చట్టాలనే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పంచాయతీరాజ్‌‌‌‌ కార్యదర్శి జీవో జారీ చేశారని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కాగా.. అనంతరామన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ రిపోర్టు ప్రకారం బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరణ చేశాకే బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ బీసీ సంఘం తరఫు న్యాయవాది వాదించారు.  

క్యాప్​ 50%  మించరాదని ఎక్కడా లేదు
రిజర్వేషన్ల క్యాప్​ 50 శాతానికి మించరాదని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదని, రాజ్యాంగంలో ఎక్కడా నిషేధంలేదని హైకోర్టులో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్​ అడ్వకేట్​ అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ప్రభుత్వం జనాభా గణాంకాలను సేకరించింది. ప్రజాప్రయోజనాలను కూడా కోర్టులు చూడాలి. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయమే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు. ఏకసభ్య కమిషన్‌‌‌‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా విధాన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. మార్చిలో ఆర్డినెన్స్​ను గవర్నరుకు పంపినా ఇప్పటివరకు ఆమోదం చెప్పలేదు. ఆగస్టులో బిల్లు పంపితే ఇప్పటివరకు అతీగతీలేదు. బిల్లులకు గవర్నర్లు రాజకీయ రంగు పులిమి ఏండ్ల తరబడి పెండింగ్‌‌‌‌లో పెడుతున్నారు” అని పేర్కొన్నారు. పిటిషనర్లు జీవోను రద్దు చేయాలంటున్నారేగానీ చట్టాన్ని సవాల్‌‌‌‌ చేయలేదని..  మధ్యంతర ఉత్తర్వులు అవసరమే లేదని తెలిపారు. తుది తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని ఉత్తర్వులు ఇస్తే సరిపోతుందన్నారు.

హైకోర్టు:  వెనకబడిన తరగతుల ప్రజలు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో జీవిస్తున్నారా?! అయితే.. ప్రభుత్వం రాష్ట్రమంతటికీ ఒకే తరహాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఎందుకు కల్పించింది?   ఆయా జిల్లాల్లోని బీసీల వెనుకబాటుతనానికి తగ్గట్టు జిల్లాలవారీగా రిజర్వేషన్లు అమలు చేయాలనే వాదనలపై ఏమంటారు?  

సింఘ్వీ: జిల్లాల్లోని బీసీల పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉంటేనే జిల్లాలవారీగా రిజర్వేషన్లు అమలు చేయాలి. కమిషనర్‌‌‌‌ ఇచ్చిన నివేదికను  విస్తృత కోణంలో చూడాలి. రాష్ట్రంలోని సగటు బీసీ పరిస్థితిని బట్టి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్ణయం తీసుకుంది. 

హైకోర్టు:  బీసీల స్థితిగతులపై కమిషన్‌‌‌‌ సమర్పించిన నివేదికను బహిరంగంగా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించాలి కదా! ఆ విధంగా చేయలేదనే వాదనకు ఏం సమాధానం చెప్తారు? కమిషనర్‌‌‌‌ రిపోర్టు పబ్లిష్‌‌‌‌ చేసి అభ్యంతరాలను స్వీకరించాలని తీర్పులు కూడా ఉన్నాయి. దీనిపై ఏమంటారు? 

సింఘ్వీ: ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం. అయినా కమిషన్‌‌‌‌ నివేదికపై శానససభ సమగ్రంగా చర్చించింది. కమిషనర్‌‌‌‌ శాస్త్రీయ విధానంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించింది. బీసీల స్థితిగతులపై జనాభా ఆధారితంగా లోతుగా పరిశీలన చేసి  నివేదికను ఇచ్చింది. శాసనసభ నిర్ణయం చట్టబద్ధం.

హైకోర్టుకు మంత్రులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ గురించి తెలుసుకునేందుకు పలువురు మంత్రులు, అధికార పార్టీ నాయకులు బుధవారం హైకోర్టుకు వచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌‌‌‌ ఆది శ్రీనివాస్, సీనియర్‌‌‌‌ నేతలు వి.హనుమంత రావు, కే.కేశవరావు, అనిల్‌‌‌‌ కుమార్, టీఆర్పీ ప్రెసిడెంట్ తీన్మార్‌‌‌‌ మల్లన్న ఇతరులు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ 5 పిటిషన్లు, తమ వాదనలు వినాలని, బీసీ రిజర్వేషన్లు సమర్థనీయమే అంటూ కాంగ్రెస్‌‌‌‌ సహా పలువురు బీసీ లీడర్లు సుమారు 25 ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్లు దాఖలు చేశారు.

విచారణ ప్రారంభం కాగానే పలువురు అడ్వకేట్లు వాదనలకు పోటీపడ్డారు. కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సీజే అసహనం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు సీరియస్‌‌‌‌ విషయమని, లక్ష్యం కోసం అందరూ ఓపిగ్గా ఉండాలని సూచించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. అందరి వాదనలు వింటామని చెప్పారు. ఈ దశలో ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్ల వాదనలు వినబోమని, తుది విచారణలోనే వింటామని చెప్పారు.

హైకోర్టు:  గవర్నర్‌‌కు బిల్లు పంపారు కదా. ఇంకా ఆమోదించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల గడువులోగా గవర్నర్‌‌ బిల్లును ఆమోదించకపోతే.. ఆ బిల్లుకు ఆమోదం లభించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించిందా? ఈ క్రమంలోనే  బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూనోటిఫై చేసిందా?

సింఘ్వీ సమాధానం:  రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ఆర్డినెన్స్​ను గవర్నర్‌‌కు పంపింది. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కూడా గవర్నర్​కు పంపింది. వీటిపై గవర్నర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్​, తమిళనాడు, పంజాబ్​ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే గవర్నర్లు​ ఇలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం బిల్లుకు ఆమోదం లభించినట్లుగా భావించాలి.

హైకోర్టు: మహారాష్ట్రకు చెందిన వికాస్​​ కిషన్​రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు కదా?

సింఘ్వీ సమాధానం: వికాస్​ కిషన్​రావు గవాలి కేసులో రిజర్వేషన్లను 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు చెప్తూనే పలు అంశాలను లేవనెత్తింది. ఆ అంశాలను తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది. డెడికేటెడ్‌‌ కమిషన్‌‌ ద్వారా బీసీల సామాజిక వెనుకబాటుతనంపై అధ్యయనం చేయాలని, ఆ కమిషన్‌‌ సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని నాడు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇవి లేనందునే గవాలి కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయితే, తెలంగాణలో బీసీల స్థితిగతులపై అధ్యయనం కోసం కమిషన్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్​ శాస్త్రీయంగా స్టడీ చేసి సమర్పించిన నివేదిక, సిఫార్సులకు తగ్గట్టుగానే బీసీ రిజర్వేషన్లను తెలంగాణలో పెంచారు. గవాలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లింది. కాబట్టి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న నిబంధన తెలంగాణలోని రిజర్వేషన్ల కేసుకు వర్తించదు.