ఆర్టీసీ సమ్మెఇల్లీగల్​ అని లేబర్​ కోర్టుకు ఎందుకు చెప్పలే..

ఆర్టీసీ సమ్మెఇల్లీగల్​ అని లేబర్​ కోర్టుకు ఎందుకు చెప్పలే..

సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అంటున్న విషయాన్ని లేబర్‌‌‌‌ కోర్టుకు ఎందుకు చెప్పలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్‌‌ 5న లేబర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, ఆ విషయాన్ని వెల్లడించే అధికారం ఆయనకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇండస్ట్రియల్‌‌ డిస్ప్యూట్‌‌ యాక్ట్‌‌ 12 ప్రకారం ఆ అధికారం లేబర్‌‌ కమిషనర్‌‌కే ఉందని, ఆయన ఇచ్చే నివేదికను బట్టి తేల్చాల్సింది లేబర్​ కోర్టేనని స్పష్టం చేసింది. ‘‘సమ్మె లీగలో ఇల్లీగలో చెప్పాల్సింది లేబర్​ కమిషనరే. ఆ విషయాన్ని ఆయన లేబర్​ కోర్టుకే రిపోర్టు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆయన రిపోర్టు చేయలేదు. ఎందుకు చేయలేదు?” అని ప్రశ్నించింది. సమ్మెపై రెండువారాల్లోగా లేబర్‌‌ కోర్టుకు ఏ విషయమూ రిపోర్టు చేయాలని లేబర్​ కమిషనర్​ను ఆదేశించింది. ఒకవేళ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని భావించినా.. అందుకు గల కారణాలను కూడా లిఖితపూర్వకంగా లేబర్​ కోర్టుకు చెప్పాలని, ఇదే విషయాన్ని ఈ కేసులోని పిటిషనర్‌‌కు, ఇతర ప్రతివాదులకు చెప్పాలని ఉత్తర్వులు ఇచ్చింది.

సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అంటున్న విషయాన్ని లేబర్‌‌‌‌ కోర్టుకు ఎందుకు చెప్పలేదని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు కేసు కారణంగా చెప్పలేదన్న రాష్ట్ర సర్కార్‌‌‌‌ వాదనను తోసిపుచ్చింది. స్టే వంటి ఆర్డర్స్‌‌‌‌ లేనప్పుడు లేబర్‌‌‌‌ కోర్టుకు చెప్పే స్వేచ్ఛ, అధికారం అధికారికి ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర సర్కార్‌‌‌‌ తరఫున ఏజీ ప్రసాద్​ వాదిస్తూ.. లేబర్‌‌‌‌ కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ప్రభుత్వ తగిన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. వాదనల తర్వాత పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు పిల్‌‌‌‌పై విచారణకు తెర దించింది.

సమ్మె, కార్మిక సంఘాల డిమాండ్ల విషయంలో లేబర్‌‌‌‌ కోర్టు తగిన ఉత్తర్వులు ఇస్తుందని స్పష్టం చేసింది. కార్మికులను డ్యూటీలో చేర్చుకోవాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని, సూచన మాత్రం చేయగలమని తెలిపింది. ఆర్టీసీ సమ్మె కేసులో ప్రజాహితం దృష్ట్యా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని, తమకున్న విశేషాధికారాలు ఉపయోగించి సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జీలతో కమిటీ వేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుదన్న ఆశ ఏమాత్రం లేదని, అందుకే విచారణను ముగిస్తున్నామని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్‌‌‌‌ అని వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిల్‌‌‌‌పై సోమవారం హైకోర్టులో పిటిషనర్, ప్రతివాదుల వాదనలు పూర్తయ్యాయి. దీంతో చీఫ్​ జస్టిస్​ ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ అభిషేక్‌‌‌‌ రెడ్డితో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఉత్తర్వులు వెలువరించి పిల్‌‌‌‌పై విచారణను ముగించింది.