
- రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్
- విద్యుత్ షాక్‌తో ఐదుగురు మృతి చెందిన ఘటనకు బాధ్యులెవరు?
- బాలుడు తన బర్త్‌డే రోజే తండ్రికి తలకొరివి పెట్టాల్సిన దుస్థితి
- దీనికి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి
- వైర్లతో స్తంభాలు బరువెక్కుతుంటే.. మామూళ్లతో సిబ్బంది జేబులు బరువెక్కుతున్నయ్
- నోట్లపై గాంధీ బొమ్మకనిపిస్తది గానీ.. స్తంభాలపై వైర్లు కనబడవా? అని ఫైర్
- అనుమతుల్లేని కేబుళ్లను వెంటనే తొలగించాలని ఆదేశం
- విచారణ 25కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: అనుమతి లేని కేబుల్స్‌ను కట్ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. వాటి వల్ల విద్యుత్ షాక్ తగిలి ప్రజల ప్రాణాలు పోవాల్నా? అని కేబుల్ కంపెనీలు, అధికారులను నిలదీసింది. ఇటీవల హైదరాబాద్ రామంతాపూర్‌లో హైటెన్షన్ వైరుకు వేలాడుతున్న కేబుల్ వైర్ తగిలి విద్యుత్‌షాక్‌తో ఐదుగురు మృతి చెందిన ఘటనకు బాధ్యులెవరు? అని ప్రశ్నించింది. ‘‘తల్లిదండ్రుల మధ్య ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన 9 ఏండ్ల బాలుడు.. అదే రోజు తన తండ్రి చితికి నిప్పంటించాల్సిన దుస్థితి ఎదురైంది. ఇది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన” అని న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆ బాలుడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందారు. ‘‘మీ కేబుళ్ల కోసం ప్రజల ప్రాణాలు పోవాల్నా? విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయినోళ్ల కుటుంబాల ఆవేదనకు బాధ్యత ఎవరిది?” అని జస్టిస్ ప్రశ్నించారు. అనుమతి లేని కేబుళ్లను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అను మతులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను నోటీసులు ఇచ్చి తొలగించాలని తేల్చి చెప్పారు. కేబుళ్ల తొలగింపుకు సంబంధించి ప్రతిపాదనలతో రావాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
జడ్జి ఘాటు వ్యాఖ్యలు..
రామంతాపూర్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. సిటీలో అనుమతి లేని కేబుళ్లను తొలగించేందుకు ఆదేశాలిచ్చింది. అయితే కేబుళ్లను కట్ చేయడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ.. ‘‘అన్ని అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు వేసుకున్నాం. కేబుళ్లను తొలగించడంతో ప్రజలకు ఇంటర్నెట్సేవల్లో అంతరాయం కలిగింది. అంతేకాకుండా పిటిషనర్ కంపెనీకి నష్టం వాటిల్లుతున్నది” అని అన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫున ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘సిటీలో సుమారు 20 లక్షలకు పైగా స్తంభాలు ఉన్నాయి. అయితే కేవలం 1.73 లక్షల స్తంభాలకు సంబంధించి మాత్రమే కేబుల్ వైర్లకు అనుమతులు ఉన్నాయి. కానీ ప్రతి స్తంభానికీ విచ్చలవిడిగా కేబుళ్లు ఉన్నాయి. పరిమితికి మించి కేబుళ్లు ఉండటంతో స్తంభాలు భారం భరించలేక వాలిపోతున్నాయి” అని చెప్పారు.
ఈ క్రమంలో జడ్జి జోక్యం చేసుకుంటూ.. ‘కేబుళ్ల బరువుకు స్తంభాలు వాలిపోతుంటే.. కిందిస్థాయి సిబ్బంది జేబులు బరువుగా మారుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. అక్రమంగా కేబుళ్లు ఉన్నాయని గుర్తించినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోతున్నామని లాయర్ చెప్పగా.. ‘నోట్లపై గాంధీ బొమ్మలను మాత్రం బాగానే గుర్తుపడ్తారా’ అంటూ జడ్జి చురకలంటించారు. ‘‘చట్టాలు ఉన్నా అవి నిద్రాణంగా ఉన్నాయి. సరళంగా ఉంటే అనుసరించలేరు.. కఠినంగా ఉంటే అమలు చేయలేరు. ఆరుగురు మృతి చెందారు. ఈ నిర్లక్ష్యానికి సమష్టి బాధ్యత తీసుకోవాలి. అనుమతుల్లేని కేబుళ్లను తొలగించాల్సిందే. ఇందుకు ఇరుపక్షాలు అవసరమైన ప్రతిపాదనలతో రావాలి” అని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.