
గజ్వేల్/ములుగు, వెలుగు : అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ‘ఉద్యానవన రంగంపై పర్యావరణ మార్పులు, ప్రభావం’ అనే అంశంపై సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
బాలకిష్టారెడ్డి హాజరై మాట్లాడారు. వచ్చే 20, 30 ఏండ్లు పర్యావరణ మార్పుల ప్రభావం తప్పనిసరిగా ఉండనుందన్నారు. పర్యావరణ నాణ్యతను కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎర్త్ సమ్మిట్, ఈఎన్ఎఫ్‌సీ, యూఎన్ఈపీ చట్టాలు, దేశంలో ఉన్న 42 రకాల రూల్స్‌కు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ దండ రాజిరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కె.ఉదయభాస్కర్, బోర్లాగ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా రీజినల్ ప్రోగ్రాం లీడర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్, వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ పాల్గొన్నారు.