- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి జూపల్లి
- మండలిలో తెలంగాణ వ్యాట్ సవరణ బిల్లు-2026 పాస్
- పెట్రోలియంను జీఎస్టీలోకి తేవాలన్న బీజేపీ.. సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించలేదన్న కాంగ్రెస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. సోమవారం శాసనమండలిలో తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) అమెండ్‌మెంట్ బిల్లు – 2026 ను ఆయన ప్రవేశపెట్టారు. +
ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారినా, తాము ఎలాంటి కొత్త పన్నులు వేయలేదన్నారు. ‘‘రిలయన్స్ బీపీ మొబిలిటీ వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతోందని గుర్తించి, దానికి అడ్డుకట్ట వేస్తూ గతంలో ఇచ్చిన జీవోకు చట్టబద్ధత కల్పించడానికే ఈ సవరణ బిల్లు తెచ్చాం. ప్రధాని స్టేట్‌మెంట్ వల్ల ప్రజలు కంగారు పడ్డారు కానీ, మన దగ్గర 2 నెలల స్టాక్ ఉంది. ఎవరూ పానిక్ కావొద్దు’’ అని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం మండలి ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
జీఎస్టీలోకి పెట్రోల్ తేవాలి: అంజిరెడ్డి
బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం పెట్రోలియంపై 35 శాతం వ్యాట్ వేస్తున్నారు. దీనివల్ల సామాన్యుడిపై భారం పడుతోంది. వెంటనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. రాష్ట్రం కూడా వ్యాట్ తగ్గిస్తే పెట్రోల్ రేట్లతోపాటు నిత్యవసరాల ధరలు తగ్గుతాయి’’ అని ఆయన కోరారు.
కేంద్రానిదే తప్పు: అద్దంకి దయాకర్
బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తిప్పికొట్టారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. న్యూ ఫ్యూయల్ పాలసీ పేరుతో కేంద్రం ఆ లాభాన్ని ప్రజలకు అందించడం లేదని విమర్శించారు. ‘‘రాష్ట్రాలకు వచ్చేది ఒక్క వ్యాట్ మాత్రమే. అందులోనూ సెస్, స్వచ్ఛ భారత్ పన్నుల పేరుతో కేంద్రం కోత విధిస్తోంది. కేంద్రమే తక్కువ ధరకు ఫ్యూయల్ ఇచ్చేలా ఆలోచించాలి’’ అని అన్నారు.
మీ రాష్ట్రాల్లో చేశారా?: తీన్మార్ మల్లన్న
వ్యాట్ అనేది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ‘‘పెట్రోల్ గనుక జీఎస్టీలోకి తెచ్చే అంశం ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? అక్కడ చేయకుండా ఇక్కడ అడగడం ఏంటి?’’ అని ప్రశ్నించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల.. చమురు సంస్థలకే తప్ప ప్రజలకు కేంద్రం వల్ల ఎలాంటి మేలు జరగడం లేదని మండిపడ్డారు.
