
- బిల్లు ఎక్కడ ఆగింది, ఏ కారణం వల్ల అనేది క్షణాల్లో తెలుసుకునే అవకాశం
- ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వెబ్సైట్ రూపకల్పన
- వివరాలు వెల్లడించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. లబ్ధిదారుల వివరాలు, ఇండ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను ఈజీగా తెలుసుకునేందుకు వెబ్సైట్లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా లబ్ధిదారుల ఫోన్ నంబరు, ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, అప్లికేషన్ నంబర్లలో దేనితోనైనా లాగిన్ కావొచ్చని వివరించారు. సమాచారం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు మూడు లక్షలకుపైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇండ్ల మార్క్ అవుట్ దగ్గర నుంచి పునాదులు, గోడలు, స్లాబ్ వరకు ప్రతి అంశాన్ని ఆన్ లైన్ లో పొందుపరుస్తున్నారు.
ఆన్ లైన్ లో ఉన్న సమాచారం మేరకే లబ్ధిదారులకు నాలుగు విడతలుగా రూ.5 లక్షలు విడుదల చేస్తున్నారు. ఇంటి నిర్మాణపు బిల్లు ఎక్కడ పెండింగ్లో ఉన్నది, ఏ అధికారి పర్యవేక్షిస్తున్నరు.. వంటి వివరాలు తెలుసుకునేందుకు ఇటీవల చాలా మంది లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్లు, కలెక్టరేట్, ఎంపీడీవోల వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సైట్ను అందుబాటులోకి తెచ్చామని, లబ్ధిదారులు స్వయంగా ఫోన్లోనే సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. ఏ కారణంతో బిల్లు ఆగిందన్న విషయం లబ్ధిదారులే స్వయంగా తెలుసుకుని, లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.