సర్కారు నిర్ణయాలకు బలవుతున్నమని ఐఏఎస్ ల ఆవేదన

సర్కారు నిర్ణయాలకు బలవుతున్నమని ఐఏఎస్ ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టు విచారణ అంటేనే భయపడుతున్నారు. ఏ విషయంలో కోర్టు చివాట్లు పెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తుందో తెలియక అయోమయంలో ఉంటున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస విచారణలే ఇందుకు కారణం. ఈ మధ్య హైకోర్టు వరుసగా ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వ్యక్తిగతంగా హాజరుకమ్మంటోంది. వచ్చిన వారిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో ఐఏఎస్‌‌లు ఇబ్బంది పడుతున్నారు.

రాజకీయ నిర్ణయాలకు మేం..

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పరస్పర విరుద్ధంగా సమర్పించిన అఫిడవిట్లపై హైకోర్టు సీరియస్ అయింది. నిజానికి కోర్టుకు ఏం చెప్పాలో పూర్తిగా రాజకీయ పరమైన నిర్ణయమే ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన మేరకు అధికారులు నివేదికలు తయారు చేస్తారు. సమ్మె విషయంలోనూ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలే అమలు చేస్తున్నారు. వాటిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ పరమైన నిర్ణయాలకు తాము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఓ సీఎం హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ‘‘నాడు సీఎం ఆదేశాలతో కొందరు రూల్స్ కు విరుద్ధంగా ఫైల్స్​పై సంతకం చేశారు. కేసుల్లో ఇరుక్కున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదు. కొందరికి ప్రమోషన్లు కూడా రాలే. అప్పట్నించి ప్రతి ఫైల్ ను జాగ్రత్తగా చదివి సంతకం చేస్తున్నం. తప్పకుండా పంపాలని ఒత్తిడి తెస్తే అభ్యంతరం రాసి ఫార్వర్డ్ చేస్తున్నం’ అని ఓ ఐఏఎస్ అధికారి చెప్పుకొచ్చారు.

నిర్ణయం ప్రభుత్వానిది.. అమలు అధికారులది..

ఏం చేయాలన్నా ప్రభుత్వ పెద్దలు నిర్ణయిస్తారు. వాళ్లు చెప్పినట్టు అధికారులు అమలు చేస్తారు. ‘‘మా అధికారులు సొంతంగా ఆలోచించడం మానేశారు. బాస్ చెప్పినట్టు విని ఫాలో అవుతున్నరు. బాస్ చెప్పిందే ఫైనల్. లేకపోతే సీన్ రివర్స్ అయితది’’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అన్నారు. నిర్ణయాలన్నీ ఒకచోట కేంద్రీకృతం కావడం వల్ల ఇట్లాంటి సమస్య వస్తోందని చెప్పుకొచ్చారు.

సునీల్ శర్మపై కోర్టు ఆగ్రహం

ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీగా ఉన్న సునీల్ శర్మను ఈ మధ్య కోర్టు తీవ్రంగా మందలించింది. ఆర్టీసీ ఎండీ హోదాలో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై సీరియస్ అయింది. ‘‘ఐఏఎస్ అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తారని అనుకున్నాం. కానీ అఫిడవిట్లలో వాస్తవాలు లేవు. తప్పుడు సమాచారం ఇస్తే ఏం అవుతుందో తెలియదా’’ అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మళ్లీ అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ బకాయిలు ఏం లేవని సునీల్ శర్మ చెప్పడంపైనా కోర్టు సీరియస్ అయింది. ఆర్టీసీ ఎండీగా ఉండి జీహెచ్ఎంసీకి ఎందుకు వకల్తా పుచ్చుకుంటున్నారని నిలదీసింది.

ఇప్పటికే ఓ సారి కోర్టు మెట్లిక్కిన సీఎస్

రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు వారం క్రితం ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది. దీంతో కోర్టుకు వెళ్లిన సీఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే డెంగీ జ్వరాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు ముందుగానే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, కానీ ప్రభుత్వంలోని పెద్దలు సీరియస్ గా తీసుకోలేదని, ఇది సీఎస్ కు ఇబ్బందిగా మారిందనే చర్చ అధికార వర్గాల్లో ఉంది.

రేపు కోర్టుకు నలుగురు ఐఏఎస్ లు

గురువారం ప్రభుత్వ యంత్రాంగంలో ఓ కీలకమైన రోజు కానుంది. ఒక కేసు విషయంలో ఒకే సారి నలుగురు ఐఏఎస్ లు కోర్టుకు హాజరుకానున్నారు. అందులో చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి అని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.  సీఎస్ ఎస్​కే జోషీతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, రవాణా శాఖ సెక్రటరీ, ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.