- ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ క్లాసులను జూన్ 1 నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ఒకే రోజులు మొదలవుతాయని తెలిపింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య రిలీజ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 304 రోజులకు గాను, సెలవులు పోను 224 పనిదినాలు ఉంటాయని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్..
అక్టోబర్ 3 నుంచి 9 వరకు ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 2027 జనవరి 18 నుంచి 23 వరకు ప్రీ-ఫైనల్, వార్షిక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమవుతాయి.
12 రోజులు దసరా హాలీడేస్..
ఇంటర్ విద్యార్థులకు ఏటా మూడు, నాలుగు రోజులు మాత్రమే దసరా హాలీడేస్ ఉండేవి. కానీ తొలిసారిగా ఏకంగా 12 రోజులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. సంక్రాంతి సెలవులు 2027, జనవరి 13 నుంచి 17 వరకు ఉండనున్నాయి. మార్చి 27ను లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించారు. మార్చి 28 నుంచి మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయంది.ప్రైవేట్ కాలేజీలు అకడమిక్ క్యాలెండర్‌ను కచ్చితంగా పాటించాలని సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
