తెలంగాణ ప్రగతిని చూసి దేశం నివ్వెరపోతున్నది

తెలంగాణ ప్రగతిని చూసి దేశం నివ్వెరపోతున్నది
  • ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నం
  • ఒకప్పుడు పల్లెలు మురికి కూపాలు.. ఇప్పుడు తొవ్వకు పచ్చని చెట్లు 
  • ఇంటింటికీ తాగునీళ్లిస్తున్నం.. గొర్రెల పెంపకంలో నెంబర్​ వన్​
  • వైద్య, ఐటీ రంగాల్లో  అద్భుత ఫలితాలు వస్తున్నయ్​
  • సమాఖ్య విధానానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నది
  • రాష్ట్ర సర్కార్​ అప్పులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు
  • రుణమాఫీ చేసినం.. కొత్త పెన్షన్లు ఇస్తున్నం

హైదరాబాద్, వెలుగు:  అన్ని రంగాల్లో యావత్​ దేశం నివ్వెరపోయే ఫలితాలను తెలంగాణ సాధిస్తున్నదని, ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని సీఎం కేసీఆర్​ అన్నారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మార్చామని, స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో తెలంగాణ చిక్కి కొట్టుమిట్టాడిందని, ఈ ఎనిమిదేండ్లలోనే కోలుకుని కడుపు నిండా తింటూ.. కంటినిండా నిద్రపోతున్నదని అన్నారు. ‘‘ఇంటింటా నల్లాలతో  స్వచ్ఛమైన తాగునీటిని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.  గొర్రెల పెంపకంలో దేశంలోనే నంబర్​ వన్​గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. వృద్ధిరేటులో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆషామాషీగా ఈ పెరుగుదల రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, అవినీతి రహిత పాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమైంది” అని సీఎం పేర్కొన్నారు. సోమవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్​ ప్రసంగించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.

‘‘సమైక్య రాష్ట్రంలో చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది” అని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చిందన్నారు. ‘‘రాష్ట్రం రాకముందు పల్లెలు మురికి కూపాలుగా ఉండే.. పట్టుబట్టి పల్లె ప్రగతి చేపట్టినం. ఇప్పుడు పల్లెల్లో తొవ్వకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతాలు పలుకుతున్నయ్​. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పింది” అని చెప్పారు. ఐటీ ఉద్యోగాల్లో కర్నాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ‘‘దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నం. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించినం. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచినం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నం. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది” అని పేర్కొన్నారు. కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. చేనేత బీమాను అందుబాటులోకి తెచ్చామని, రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు.  

ఒకేసారి 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నం

ఇప్పటికే 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని సీఎం కేసీఆర్​ అన్నారు.  91,142 ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేసుకుంటున్నామని తెలిపారు. ఎనిమిదేండ్లలో రూ. 2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పరిశ్రమలు, ఐటీ సెక్టార్​లో 16.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. 1500కు పైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలు హైదరాబాద్​లో ఉన్నాయన్నారు. దళితబంధు పథకం దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నదని,  ప్రతి దళిత కుటుంబానికి  రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది దళితబంధు పథకం ద్వారా దాదాపు 40 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  

రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం

రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేసీఆర్  మండిపడ్డారు. ‘‘కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే.. దేశ ప్రజలు అన్నిరకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నరు. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నది” అని దుయ్యబట్టారు. పసి పిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తున్నదని మండిపడ్డారు. కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ర్పచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు అవగాహనరాహిత్యంతోనూ, కుట్రపూరితంగా  వ్యాఖ్యానిస్తున్నరు. అప్పులను ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగిస్తున్నం” అన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్​లోనూ జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద నివాళులర్పించారు.

కాళేశ్వరం ముచ్చట్నే లేదు

సీఎం కేసీఆర్​ తన మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పెద్దగా ప్రస్తావించలేదు.‘‘కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును నిర్మించాం..’’ అనే మాట తప్ప ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. కాళేశ్వరం నిర్మాణం మొదలుపెట్టిన నాటి నుంచి స్వాతంత్య్ర వేడుకలతో పాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ దీని గురించి గొప్పగా చెప్పేవారు.   జూన్ 2న నిర్వహించిన ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశంలోనే చరిత్ర’’ అని కీర్తించారు. రాష్ట్రానికే ఈ ప్రాజెక్టు లైఫ్ లైన్ అని చెప్పారు. సరిగ్గా రెండున్నర నెలల తర్వాత ఆ ప్రాజెక్టు ఊసే లేకుండా సీఎం కేసీఆర్​ ప్రసంగం సాగింది. జులైలో ప్రాణహిత, గోదావరి ఉప్పొంగడంతో కాళేశ్వరం డిజైన్లలో లోపాలు బట్టబయలయ్యాయి. ప్రాజెక్టు ప్రధాన పంపుహౌస్ కన్నెపల్లితో పాటు అన్నారం పంపుహౌస్ వరద నీటిలో మునిగిపోయింది. కన్నెపల్లి పంపుహౌస్ ఎప్పటికి ఎత్తిపోతలకు సిద్ధమవుతుందో ఇంజనీర్లే సరిగా చెప్పలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే సీఎం ప్రసంగంలో కాళేశ్వరం గొప్పలకు చోటు దక్కనట్టుగా తెలుస్తోంది.