- గ్లోబల్ సమిట్‌లో నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రశంసలు
- రేవంత్ డ్రీమ్ సక్సెస్ అవుతది.. రెండేండ్లలోనే అద్భుతాలు
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమే
- ఇండియా అంటే సమస్యలు కాదు..
- 140 కోట్ల సొల్యూషన్స్ అని వెల్లడి
- గ్లోబల్ సమిట్‌లో నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రశంసలు
హైదరాబాద్, వెలుగు: వికసిత్ భారత్‌లో తెలంగాణది డ్రైవర్ సీటు అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పేర్కొన్నారు. ‘‘రేపటి వికసిత్ భారత్ రేసులో తెలంగాణ ఎప్పుడూ వెనుక సీట్లో కూర్చోదు. ఒక పవర్‌ఫుల్ ఇంజిన్ లెక్క ముందుండి దేశాన్ని నడిపిస్తుంది. షైనింగ్ తెలంగాణగా దూసుకుపోతుంది’’ అని తెలిపారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో కైలాశ్ సత్యార్థి ప్రసంగించారు.
సీఎం రేవంత్‌రెడ్డి విజన్, రెండేండ్లలో సాధించిన ప్రగతిని చూసి తాను ఆశ్చర్యపోయానని, ఇది నిజంగా అద్భుతమని కొనియాడారు. ‘‘భవిష్యత్ ఇండియాలో తెలంగాణ పాత్ర కీలకం. 2047 నాటికి దేశం వికసిత్ భారత్‌గా మారే క్రమంలో.. తెలంగాణ బ్యాక్ సీట్లో ఉండదు. డ్రైవింగ్ సీట్లో ఉండి దేశాన్ని నడిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిది చాలా ధైర్యం, సాహసోపేతమైన డ్రీమ్. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ (సుమారు రూ.84 లక్షల కోట్లు) ఎకానమీ లక్ష్యం సాధ్యమే. ఇక్కడున్న మీ అందరి ముఖాల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే అది కచ్చితంగా సాధ్యమవుతుందని అనిపిస్తున్నది. అంతేకాదు.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని కూడా మీరు సులభంగా చేరుకుంటారు” అని వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాలు భేష్
కేవలం రెండేండ్లలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇంత భారీ నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం అని కైలాశ్ సత్యార్థి కొనియాడారు. ‘‘20 లక్షల మందికి పైగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి.. వారిలో భరోసా నింపారు. ఆడబిడ్డలు, యువతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి.. వారి రోజువారీ జీవితాలను సులభతరం చేశారు. వైద్య, విద్యా రంగాల్లో క్వాలిటీ మార్పులు తీసుకొచ్చారు”అని అభినందించారు. సమిట్ బ్రోచర్ మీద మహాత్మా గాంధీ ఫొటోను ముద్రించడం చూసి చాలా సంతోషించానని కైలాశ్ సత్యార్థి పేర్కొన్నారు.
‘‘గాంధీజీ అప్పట్లో ప్రధాని నెహ్రూకు ఒక మంత్రం చెప్పారు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పథకం తెచ్చినా.. అది నీ కంటికి కనిపించిన అత్యంత నిరుపేద వ్యక్తి ముఖంలో చిరునవ్వు నింపుతుందా? లేదా? అని చూసుకో.. అలా జరగకపోతే ఆ పథకాన్ని చెత్తకుప్పలో పడేయ్’’ అని సూచించారని తెలిపారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని అన్నారు. గాంధీ, నెహ్రూల స్ఫూర్తితో.. ఆఖరి వరుసలో ఉన్న మనిషిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
సమస్యలకు ప్రతి భారతీయుడు ఓ పరిష్కారమే..
దేశంలోని సమస్యలకు ప్రతి భారతీయుడు ఓ పరిష్కారమే అని కైలాశ్ సత్యార్థి తెలిపారు. ‘‘నాకు నోబెల్ వచ్చిన కొత్తలో ఒక విదేశీ జర్నలిస్ట్ నన్ను అడిగారు.. ‘సార్.. ఇండియాలో పేదరికం, బాలకార్మిక వ్యవస్థ ఇలా వంద సమస్యలు ఉన్నాయి కదా.. మీరెలా పోరాడుతారు?’ అని. అప్పుడు నేను అతనికి గర్వంగా సమాధానం చెప్పాను. ‘నా మాతృభూమిలో 100 సమస్యలు ఉండొచ్చు.. కానీ అక్కడ 140 కోట్ల సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ప్రతి భారతీయుడు ఒక పరిష్కారమే’.. ఈ రోజు ఈ సభలో ఉన్న మీరంతా ఆ సొల్యూషన్స్. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలే అసలైన పరిష్కారాలు” అని పేర్కొన్నారు.
ఇన్నాళ్లూ మార్కెట్లను, ఎకానమీని గ్లోబలైజ్ చేశామని, ఇప్పుడు మానవత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ‘కలిసి నడుద్దాం’ అనే సూత్రాన్ని పాటిస్తూ.. సెల్ఫ్ , సోషల్, గ్లోబల్ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ‘‘ఇక్కడికి వచ్చిన ఇన్వెస్టర్లు కేవలం లాభాల కోసమే కాకుండా.. శాంతిని, సహనాన్ని పెంచేలా పెట్టుబడులు పెట్టాలి. ఎవరినీ వెనుక విడిచిపెట్టకుండా అందరం కలిసి తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మారుద్దాం’’ అని సత్యార్థి పిలుపునిచ్చారు.
సంపద అందరికీ పంచడమే అసలైన అభివృద్ధి : అభిజిత్ బెనర్జీ
సంపద అందరికీ పంచడమే అసలైన అభివృద్ధి అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ‘‘అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, భారీ లెక్కలు కాదు.. రాష్ట్రంలో సంపాదించిన సంపదను ప్రతి ఒక్కరికీ పంచాలి. గ్రోత్‌లో చివరి మనిషి కూడా భాగస్వామ్యం కావాలి. తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అభివృద్ధి ఫలాలు అందరికీ పంచాలనే ఆలోచన ఇందులో ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ గుర్తించడం అభినందనీయం” అని ప్రశంసించారు. గ్లోబల్ సమిట్‌కు హాజరుకాలేకపోయిన అభిజిత్ బెనర్జీ.. వీడియో మెసేజ్ ద్వారా తన స్పందనను తెలియజేశారు.
పెద్ద పెద్ద లక్ష్యాలకు చిన్న చిన్న అడుగులే కీలకమని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కావాలని, భారీగా గ్రోత్ రేట్ పెరగాలని లక్ష్యం పెట్టుకోవడం మంచిదే. కానీ ఆ స్థాయికి ఎలా వెళ్లాలనే దానిపై గ్రౌండ్ లెవల్ ప్రణాళిక ఉండాలి. విజన్ ఎంత పెద్దగా ఉన్నా.. దాని కోసం మనం వేసే చిన్న చిన్న అడుగులే ఎంతో ముఖ్యం. పెద్ద కలలు నిజం కావాలంటే పునాది గట్టిగా ఉండాలి. మన దగ్గర చదువుతున్న మూడో క్లాసు పిల్లల్లో కనీసం 80 శాతం మందికైనా వాళ్ల గ్రేడ్‌కు తగ్గట్టుగా లెక్కలు చేయడం, చదవడం రావాలి. ఇది చూడడానికి చిన్న విషయమే అనిపించొచ్చు. కానీ పిల్లల భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రగతికి ఇదే అసలైన పునాది’’ అని తెలిపారు.
