రాబోయే 4 రోజులు మస్తు వానలు..12,13న రెడ్‌ అలర్ట్

రాబోయే 4 రోజులు మస్తు వానలు..12,13న రెడ్‌ అలర్ట్

హైదరాబాద్‌, వెలుగు: రాబోయే 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12, 13 తేదీల్లో  రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. సర్కారును కూడా అప్రమత్తం చేసింది. వరదలు వస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, చెట్లు విరిగిపడొచ్చని, రైలు, రోడ్డు రవాణాతోపాటు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగవచ్చని, పంటలు నీటమునిగి నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. 

ఇప్పటికే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రుతుపవనాలు వేగం పుంజుకునే చాన్స్‌‌‌‌ ఉంది. రానున్న రెండు మూడు రోజుల్లో  రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో అత్యధికంగా 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్​ అర్బన్‌‌‌‌లోని హన్మకొండ, కామారెడ్డిలోని బిక్నూరులో 12 సెం.మీ., కరీంనగర్‌‌‌‌లోని హుజూరాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌లోని హసన్‌‌‌‌పర్తిలో 9 సెం.మీ., మంచిర్యాలలోని చెన్నూరు, నిజామాబాద్‌‌‌‌లోని బోధన్‌‌‌‌లో 8 సెం.మీ., జగిత్యాలలోని మల్లాపూర్‌‌‌‌, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌లోని భీమదేవరపల్లిలో 7 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయింది. 

ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ

రాష్ట్రంలో వారం రోజులుగా వానలు పడుతున్నాయి. సాధారణం కంటే అధికంగా కురుస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో సగటున 2 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 5.5 సెం.మీ. రికార్డయింది. మొత్తం 33 జిల్లాల్లో వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో మస్తు వానలు పడ్డాయి.  

ఈ జిల్లాలకు రెడ్‌‌‌‌ అలర్ట్‌‌‌‌ ..

ఈ నెల 12న : కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, కరీంనగర్‌‌‌‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌, ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌, జనగామ.ఈ నెల 13న : కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌‌‌‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌‌‌‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌.