
- రాష్ట్రంలో రీలైఫ్, రెస్పిఫ్రెష్టీ-ఆర్ సిరప్‌లపై నిషేధం
- వీటిల్లో ప్రమాదకర డైఇథైలిన్ గ్లైకాల్
- వీటిని అమ్మొద్దని డీసీఏ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో దగ్గు మందు వల్ల 11 మంది చిన్నారులు మరణించడంతో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రమాదకర డైథైలిన్ గ్లైకాల్ (డీఈజీ) ఉన్నట్టు అనుమానంతో కోల్డ్ రిఫ్ ఎస్ఆర్-13 బ్యాచ్ దగ్గు మందును నిషేధించిన డీసీఏ.. ఇప్పుడు మరో రెండు సిరప్‌లపై నిషేధం విధించింది. గుజరాత్‌కు చెందిన షేప్ ఫార్మా కంపెనీ తయారు చేసిన రీలైఫ్ సిరప్ (బ్యాచ్ నెం LSL25160), రెడ్‌నెక్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారు చేసిన రెస్పిఫ్రెష్ టీఆర్ సిరప్ (బ్యాచ్ నెం RDL22523) లలో ప్రమాదకర డైథైలిన్ గ్లైకాల్ ఉన్నట్టు మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ల్యాబ్‌ల రిపోర్టుల ఆధారంగా నిర్ధారించింది.
దీంతో ఈ మందులను మెడికల్ స్టోర్‌లలో అమ్మకూడదని, ప్రజలు కూడా వాడకూడదని డీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఎవరి దగ్గరైనా ఈ మందులు ఉంటే సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆఫీసులో అప్పగించాలని, ఇతర సమాచారం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969కి కాల్ చేయవచ్చని సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రీటెయిలర్లు, హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హాస్పిటల్స్ నుంచి ఈ మందుల స్టాక్‌ను తక్షణమే ఫ్రీజ్ చేయాలని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు డీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
మోతాదుకు మించి వాడొద్దు..
ప్రజలు దగ్గు మందులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ప్రభుత్వ ఆదేశాలు, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా మాత్రమే కొనుగోలు చేయాలని డీసీఏ అధికారులు సూచిస్తున్నారు. పిల్లల విషయంలో దగ్గు, జలుబు మందులను వాడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సూచించాయి. రెండేండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని.. ఐదేండ్లలోపు పిల్లలకు కూడా సాధారణంగా ఈ మందులను సిఫార్సు చేయకూడదని పేర్కొన్నాయి. ఐదేండ్లు దాటిన పిల్లలకు డాక్టర్ల సూచన మేరకు సరైన మోతాదులో ఇవ్వాలని సూచించాయి.