
16.89 శాతం వృద్ధి: జయేశ్ రంజన్
హైదరాబాద్, వెలుగు: 2018–19 రాష్ట్ర ఐటీ ఎగుమతులు లక్షా 9 వేల 219 కోట్ల రూపాయలకు చేరాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశ ఐటీ వృద్ధి 8 నుంచి 10 శాతం మాత్రమే ఉండగా, రాష్ట్రంలో 16.89 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. శనివారం 2018–19 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖలు వేర్వేరుగా విడుదల చేశాయి. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక 5,43,033 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 67,725 మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటిదాకా రూ.1,58,274 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. మొత్తంగా 9,334 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం కంపెనీల ద్వారా 11,32,126 మందికి ఉపాధి దొరికిందన్నారు. 2018-–19 ఆర్థిక సంవత్సరంలో 3,058 పరిశ్రమలకు అవకాశమిచ్చామని, రూ.35,780 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు