హరీశ్, సంతోష్ అవినీతి అనకొండలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హరీశ్, సంతోష్ అవినీతి అనకొండలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • వాళ్లవల్లే కేసీఆర్‌‌కు ఈ అవినీతి మరక
  • కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
  • ఇందులో మేఘా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది 
  • ఈ వయసులో కేసీఆర్‌‌కు సీబీఐ విచారణ ఏంటి?
  • ఇలాంటి పరిస్థితిలో పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత!
  • ఆ దుర్మార్గుల వల్లే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది
  • ఇన్నాళ్లూ నన్ను ఏమన్నా భరించిన.. ఇక నుంచి తోలుతీస్తా ఖబడ్దార్​ అంటూ వార్నింగ్​
  • ప్రెస్​మీట్​ తర్వాత బీఆర్​ఎస్​ గ్రూపుల నుంచి కవిత పీఏ, పీఆర్​ఓ తొలగింపు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌రావు అవినీతి అనకొండలు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ ప్రస్తుత దుస్థితికి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌రావుతోపాటు మేఘా కృష్ణారెడ్డి కారణమని ఆరోపించారు. వాళ్ల వల్లే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవినీతి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు చెప్పుకొని వారు లబ్ధి పొందారని, వాళ్ల వల్లే కేసీఆర్ బద్నాం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. 

‘‘అయినా వాళ్లనే మోస్తాం.. వాళ్లకే ఇస్తాం’’ అంటే పార్టీ ఎట్లా ముందుకు పోతుందని ప్రశ్నించారు. ఒక బిడ్డగా తనకు చాలా బాధగా ఉందని తెలిపారు.  ఐదేండ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు ఇందులో మేజర్ పాత్ర లేదా? అని అడిగారు. అందుకే రెండో టర్మ్ లో హరీశ్‌‌‌‌‌‌‌‌రావును మంత్రి పదవినుంచి కేసీఆర్ తప్పించారని అన్నారు. సోమవారం కవిత అమెరికా నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వచ్చారు. జాగృతి ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్ అని పేర్కొన్నారు. తెలంగాణకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్​ ఆరు, ఏడు నెలలు రీసెర్చ్ చేశారని తెలిపారు. ఆయనకు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదని, ఉన్నదల్లా తెలంగాణకు మంచి చేయాలన్న ధ్యాసేనని చెప్పారు. అలాంటి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. “కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవినీతి మరక ఎట్లా వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలి. ఆయన పక్కన ఉన్న వాళ్ల వల్ల అవినీతి మరక అంటింది. 

అందులో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌రావు, మేఘా కృష్ణారెడ్డి పాత్ర ఉంది. కేసీఆర్ నీళ్ల గురించి ఆలోచన చేస్తే.. వాళ్లేమో సొంత వనరులు, ఆస్తులు పెంచుకునేందుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. హరీశ్, సంతోష్ వెనుక రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నాడు. ఆ అవినీతి అనకొండలు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బద్నాం చేస్తున్నాయి. వారిని మాత్రం ఏమీ అనరు” అని వ్యాఖ్యానించారు. 

నాపై కుట్రలు చేశారు..

హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, సంతోష్‌‌‌‌‌‌‌‌రావు తనపై ఎన్ని కుట్రలు చేసినా భరించానని కవిత తెలిపారు. “నా మీద ఎన్నో పుకార్లు పుట్టించినా.. మీడియా వాళ్లకు ఏవేవో చెప్పినా భరించాను. నా మీద అంతలా పర్సనల్ ఎటాక్ చేసినా ఎప్పుడూ వాళ్ల పేర్లు చెప్పలేదు. కానీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ వయసులో సీబీఐ విచారణ ఏంటి? వీళ్లను చూస్తూ ఎందుకు భరించాలి? ఇవన్నీ వింటుంటే బీఆర్ఎస్ తమ్ముళ్లకు కోపం రావొచ్చు. వాస్తవాలు చేదుగానే ఉంటాయి.. అప్పుడప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటేనే.. మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగైతది. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది హిమాలయాలంతటి వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిని చెయ్యిపెట్టి చూపించి అవినీతి అంటుంటే బాధగా ఉంది. రాజకీయాల్లో 40-–50 ఏండ్లు ఉన్నా ఆస్తులు సంపాదించుకోలేదు. నా పెండ్లికి కూడా ఇబ్బంది పడ్డాడు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీబీఐ ఎంక్వయిరీ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇద్దరు, ముగ్గురు ఇంజనీర్ల దగ్గర వందల కోట్లు బయటపడినా.. వారి వెనక ఎవరున్నారో విచారణ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు” అని అన్నారు. 

ఘోష్  కమిషన్ పేరుతో టైం పాస్ 

కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్  కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తున్నదని కవిత అన్నారు. “రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫొటో రాదు. ఏం చర్యలు తీసుకుంటారో చెప్పకుండా డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా సీబీఐ ఎంక్వయిరీ వేశారు. అంటే కావాలనే కేసీఆర్ పేరు, ప్రతిష్టలను దెబ్బ తీయాలనే దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగినప్పుడల్లా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బట్ట కాల్చి మీద వేస్తున్నది. 

మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నేను పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి. అప్పుడు తేలుతుంది మీకు ఒప్పందాలున్నాయో? లేవో? అని. మీకు, మీకు ఒప్పందాలు ఉన్నాయి.. అందుకే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టార్గెట్ చేసుకున్నారు. ఇంతకు ముందు తెలంగాణలో ఇలాంటి పరిస్థితి లేదు” అని అన్నారు. కాగా, బిహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను కాంగ్రెస్ బలి చేస్తున్నదని మండిపడ్డారు. బీసీ బిల్లులు, ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌పై  సుప్రీంకోర్టుకు ఎందుకు పోలేదని నిలదీశారు. 

కొత్తగా 50% పరిమితి ఎత్తేస్తున్నామంటూ కామెడీలు చేస్తున్నారని విమర్శించారు. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసమే ఈ కొత్త నాటకం అని అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా జాగృతి ఆధ్వర్యంలో ప్రచారం చేస్తామని హెచ్చరించారు. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.

నాది కేసీఆర్ బ్లడ్ 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.  స్థానిక ఎన్నికల్లో గెలిస్తే ఎంత.. ఓడితే ఎంత అని అన్నారు. ‘‘ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఈ దుర్మార్గుల వల్లే కదా? పైసలున్నయ్​.. టీవీలున్నయ్​.. సోషల్ మీడియా ఉన్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు.  

రేపటి నుంచి తన వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని అన్నారు. “రేవంత్ మాట్లాడిస్తున్నాడు అని.. బండి సంజయ్ చెప్తే మాట్లాడుతున్నానని దుష్ప్రచారం చేస్తారు. కానీ నేను ఒకరు చెప్పినట్టు, ఆడించినట్టు ఆడే తోలు బొమ్మను కాను. ఖబర్దార్ .. నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా. నాది కేసీఆర్ బ్లడ్. నేను ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గానే ఉంటా. దేవుడిలాంటి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీబీఐ ఎంక్వయిరీ అంటే కడుపు రగిలి చెప్తున్నా. 

నా తండ్రికి రాసిన లేఖను లీక్ చేసినా వాళ్ల పేర్లు తీసుకోలేదు. రోజూ నరకం చూపిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాయిస్తున్నారు. అయినా ఎప్పుడూ వాళ్ల పేర్లు నేను చెప్పలేదు. తెలంగాణ పేరుకు నష్టం చేస్తున్నారు కాబట్టే మాట్లాడుతున్నా. ఇకపై నా మీద ఒక్క కామెంట్ పెడితే మేం పది కామెంట్లు చేస్తం. గీత గీసుకొని చేస్తం. పెద్దాయన దాకా వచ్చింది కాబట్టి ఇక ఊరుకునేది లేదు. 

ఘోష్ కమిషన్ వేసిన రోజే పార్టీ ఎందుకు రియాక్ట్ కాలేదు అని ఆరోజే అడిగిన” అని ఆమె చెప్పుకొచ్చారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీబీఐ ఎంక్వయిరీ అంటే తెలంగాణ భగ్గుమనొద్దా? అని నిలదీశారు.