తెలంగాణ జాబ్ స్పెషల్.. భారత జాతీయ సైన్యం

తెలంగాణ జాబ్ స్పెషల్.. భారత జాతీయ సైన్యం

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1942, ఫిబ్రవరి నాటికి సింగపూర్​లోని బ్రిటిష్​ ప్రభుత్వం జపాన్​కు లొంగిపోయింది. ఈ సమయంలో కొన్ని వేల మంది భారత యుద్ధ ఖైదీలు జపాన్​కు పట్టుబడ్డారు. ఈ ఖైదీలను భారత ఆర్మీ అధికారి మోహన్​సింగ్​కు జపాన్​ సైన్యాధిపతి ఫూజివారా అప్పగించారు. యుద్ధ ఖైదీలతో బ్రిటిష్​కు వ్యతిరేకంగా ఇండియన్​ నేషనల్​ ఆర్మీని ఏర్పాటు చేసేలా మోహన్​సింగ్​ను జపనీయులు ఒప్పించారు. 1942 ఆగస్టులో మోహన్​సింగ్​ 40 వేల మంది యుద్ధ ఖైదీలతో ఇండియన్​ నేషనల్​ ఆర్మీని సింగపూర్​లో ఏర్పాటు చేశారు. ఐఎన్​ఏ రూపకర్త, స్థాపకుడిగా కెప్టెన్​ మోహన్​సింగ్​ను పిలుస్తారు. ఈ సంస్థ మార్చ్​ ‘కదమ్​ కదమ్​ బడాయే జా’. దీనిని రామ్​సింగ్​ ఠాకూర్​ కంపోజ్​ చేశాడు. ఆ తర్వాత ఐఎన్​ఏ పాత్రపైన జపాన్​ సైనికాధికారులకు, మోహన్​సింగ్​కు వచ్చిన వివాదాల వల్ల మోహన్​సింగ్​, నిరంజన్​సింగ్ గిల్​లు అరెస్టయ్యారు. ఇదే సమయంలో జపాన్​లో ప్రవాస జీవితం గడుపుతున్న రాస్​ బిహార్​ బోస్​ టోక్యోలో 1942లో ఇండియన్​ ఇండిపెండెన్స్​ లీగ్​ను స్థాపించాడు. బ్యాంకాక్​లో జరిగిన సదస్సులో రాస్​బిహారీ బోస్​ చైర్మన్​గా ఉన్న ఇండియన్​ ఇండిపెండెన్స్​ లీగ్​ కిందికి ఐఎన్​ఏను తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇది ఐఎన్​ఏలో విలీనమైంది. జపాన్​, రాస్​ బిహార్​ బోస్​ ఆహ్వానం మేరకు సుభాష్​ చంద్రబోస్​ సింగపూర్​ వెళ్లి రాస్​బిహారీని కలిసి 1943లో ఇండియన్​ ఇండిపెండెన్స్​ లీగ్​, ఐఎన్ఏ బాధ్యతలు స్వీకరించాడు. సుభాష్​ చంద్రబోస్​ 1943 ఆగస్టు 25న ఐఎన్​ఏ సుప్రీంకమాండర్​గా బాధ్యతలు స్వీకరించాడు. 

ఆజాద్​ హింద్​ ఫౌజ్

సుభాష్​ చంద్రబోస్​ ఇండియన్​ నేషనల్​ ఆర్మీని పునర్వ్యవస్థీకరించి ఆజాద్​ హింద్​ ఫౌజ్​గా మార్చాడు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడం. ఇండియన్​ నేషన్​ ఆర్మీ, ఇండియన్​ ఇండిపెండెంట్​ లీగ్​ల కలయికగా ఆజాద్​ హింద్​ ఫౌజ్​ ఉండేది. ఈ ఫౌజ్​ భారతీయులను సైన్యంలో చేరాలని ఉత్తేజితులను చేయడానికి ఆజాద్​ హింద్​ రేడియోని ఉపయోగించింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందడం కోసం జపాన్​ పూర్తిగా సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని టోజో సుభాష్​ చంద్రబోస్​కు హామీ ఇచ్చాడు. 1944, జూలై 6న బోస్​ ఈ రేడియో ద్వారా గాంధీని జాతిపిత అని సంబోధిస్తూ భారత తుది పోరాటానికి ఆశీస్సులను కోరారు. ఐఎన్​ఏ ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్​ జిందాబాద్​. ఈ నినాదాన్ని మౌలానా హస్రత్​ మోహానీ రూపొందించాడు. ఐఎన్​ఏ ప్రధాన కేంద్రాన్ని 1944, జనవరిలో బర్మాలోని రంగూన్​కు మార్చారు. 

ఐఎన్​ఏలోని రెజిమెంట్స్​

సుభాష్​ చంద్రబోస్​ 1943, నవంబర్​ 6న అండమాన్​ నికోబార్​ దీవులను ఆక్రమించి అండమాన్ దీవులకు షహీద్​ దీవులని, నికోబార్ దీవులకు స్వరాజ్​ దీవులని పేరు పెట్టాడు. 1944 మార్చి 18న హింద్​ ఫౌజ్​ బర్మా సరిహద్దును దాటి భారత నేలపై అడుగు పెట్టింది. బహదూర్​ గ్రూప్​కు చెందిన కల్నల్​ మాలిక్​ నేతృత్వంలో ఏప్రిల్​ 14న మొదటిసారిగా భారత ప్రధాన భూభాగంలోని మొయిరాంగ్​ (మణిపూర్​) వద్ద ఐఎన్​ఏ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడే మూడు నెలలు సైనిక పాలన నిర్వహించారు. ప్రస్తుతం మొయిరాంగ్​లో ఐఎన్​ఏ మెమోరియల్​ కాంప్లెక్స్​ ఉంది. 1944లో హింద్​ ఫౌజ్​ సైన్యం కోహిమా దండయాత్రలో భాగంగా చలో ఢిల్లీ, జైహింద్​ నినాదాలతో ఢిల్లీని ఆక్రమించి బ్రిటిష్​ పాలనను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, 1944లో జపాన్​ దళాల నుంచి సరైన సహకారం ఐఎన్ఏకు అందకపోవడంతో 1945 మేలో బ్రిటిష్​ వారు రంగూన్​ను ఆక్రమించారు. ఈ ఆక్రమణతో ఐఎన్​ఏ సైనికులు బ్రిటిష్​ వారికి యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. దీంతో భారత జాతీయ సైన్యం సాగించిన స్వాతంత్ర్య పోరాటం ముగిసింది. 

ఎర్రకోట విచారణ

భారత జాతీయ సైన్యానికి చెందిన యుద్ధ ఖైదీలను బ్రిటిష్​ వారు 1945 నవంబర్ 5న ఎర్రకోట వద్ద విచారణ చేశారు. దీన్నే ఐఎన్​ఏ విచారణ లేదా ఎర్రకోట విచారణ అంటారు. ఇందులో ప్రేమ్​ కుమార్​ సెహెగల్​, షా నవాజ్​ ఖాన్​, గుర్​బక్ష్​ సింగ్​ ధిల్లాన్​లు నిందితులుగా ఉన్నారు. వీరిని విడుదల చేయాలని ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​, ముస్లిం లీగ్​, ఆర్​ఎస్​ఎస్​, హిందూ మహాసభ, కమ్యూనిస్ట్​ పార్టీ, జస్టిస్​ పార్టీ విజ్ఞప్తి చేశాయి. వీరి తరఫున భూలాభాయ్​ దేశాయ్​ తేజ్​బహదూర్​ సఫ్రూ, కెలాస్​నాథ్​​ కట్జు, జవహర్​లాల్​ నెహ్రూ, అరుణా అసఫ్​ అలీ వాదించారు. ఈ విచారణ నవంబర్​ 5 నుంచి 11 వరకు వారం రోజులపాటు జరిగింది. దీన్నే ఐఎన్​ఏ వారం అంటారు. నవంబర్​ 12ను ఐఎన్​ఏ దినంగా పరిగణించారు. చివరికి 1945 డిసెంబర్​ 13న యుద్ధ ఖైదీల విచారణ ముగిసింది. ముగ్గరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఆనాటి భారత్​ సర్వసైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్​ క్లాడ్​ అచిన్​లేకన్​ బ్రిటిష్​ ప్రధాని అట్లీని ఒప్పించి, శిక్షలు రద్దు చేయించారు. 

ఇండియన్​ నేషనల్​ ఆర్మీ ప్రధాన కేంద్రాన్ని సుభాష్​ చంద్రబోస్​ సింగపూర్ లో స్థాపించాడు