తలకిందులైన కంటివెలుగు అంచనాలు

తలకిందులైన కంటివెలుగు అంచనాలు
  • కంటివెలుగు తొలి దశలో 32% మందికి కంటి సమస్యలు 
  • ఇప్పుడు 28 శాతం మందిలోనే సమస్య ఉన్నట్లుగా వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశమంతటా కంటి సమస్యలు ఉన్నోళ్ల సంఖ్య పెరుగుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం ఇది రివర్స్ అయింది. సర్కార్ చేయిస్తున్న కంటి వెలుగు లెక్కలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. కంటి వెలుగు తొలి దశ స్ర్కీనింగ్‌‌లో టెస్ట్ చేయించుకున్న ప్రతి వంద మందిలో 32 మందికి ఏదో ఒకరకమైన కంటి సమస్య ఉన్నట్టుగా డాక్టర్లు తేల్చారు. ఇప్పుడు చేస్తున్న రెండో దశ స్ర్కీనింగ్‌‌లో ప్రతి వంద మందిలో 28 మందికి మాత్రమే కంటి సమస్య ఉన్నట్టుగా తేల్చినట్టు సర్కార్ ప్రకటించిన కంటి వెలుగు లెక్కలు చెప్తున్నాయి. అయితే, ఈ లెక్కల మీద డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు ముంగటికి, ఇప్పటికీ కంటి సమస్య ఉన్నోళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇందుకు భిన్నంగా కంటి వెలుగు రిజల్ట్స్‌‌ ఉండడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..

కంటి వెలుగు తొలి దశ కార్యక్రమం 2018లో జరిగింది. అప్పుడు మొత్తం కోటి 54 లక్షల మందికి టెస్టులు చేశారు. అందులో 50.39 లక్షల మందికి కంటి సమస్యలున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటిం చింది. మిగిలిన వారికి సమస్యలు లేవని తెలిపింది. ఇక ఇటీవల ప్రారంభమైన కంటి వెలుగు రెండో దశ స్క్రీనింగ్‌‌లో ఇప్పటివరకూ 99.81 లక్షల మందికి పరీక్షలు చేసినట్టు సర్కార్ ప్రకటించింది. ఇందులో 28.22 లక్షల మందికి సమస్యలున్నట్టు గుర్తించామని తెలిపింది. ఇంకో 71.58 లక్షల మందికి సమస్యలేమీ లేవని రిపోర్ట్‌‌లో పేర్కొంది. సంఖ్య తగ్గ డంపై అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తలకిందులైన అంచనాలు

2018 నాటితో పోలిస్తే, ఇప్పుడు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, టీవీలు చూడ టం పెరగడంతో.. స్క్రీన్ టైమ్ కూడా మరిం త పెరిగింది. కరోనా లాక్‌‌డౌన్, ఆన్‌‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌‌ తదితర కారణాలతో స్ర్కీన్ టైమ్ విపరీతంగా పెరిగింది. దీంతో చాలా మంది కంటి సమస్యల బారిన పడ్డారు. ఈ లెక్కన కంటి వెలుగు రెండో దశ స్ర్కీనింగ్‌‌లో కనీసం 40% మందిలో సమస్యలు బయటపడతాయని డాక్టర్లు అంచనా వేశారు. కానీ, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ 28% మందిలోనే సమస్యలున్నట్టుగా చెబుతుండడంతో డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి దశలో 32% మందిలో సమస్యలున్నట్టుగా గుర్తిస్తే, ఇప్పుడు 28% మందిలోనే సమస్యలు ఉన్నట్టుగా చెప్పడం గమనార్హం.