
సైదాపూర్, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై తీసుకున్న అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సైదాపూర్ మండలకేంద్రం, వెన్కపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆమె పరిశీలించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికే చేశామన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలపై అర్జీలు ఇస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పూర్తి అవగాహనతో దరఖాస్తుల పరిశీలన, విచారణ, పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో తహసీల్దార్లు కనుకయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
2,39,996 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 328 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,39,996 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి, 29,630 మంది రైతుల ఖాతాల్లో రూ.445.23 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఇప్పటివరకు 80 శాతం మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని వెల్లడించారు. 70 కొనుగోలు కేంద్రాల్లో 100 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయీస్ ఆఫీసర్ నర్సింగరావు, డీఎం రజనీకాంత్, డీఏవో భాగ్యలక్ష్మి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ రామానుజం, తదితరులు పాల్గొన్నారు.------------