
హైదరాబాద్, వెలుగు: సమగ్ర కుల గణన సర్వే డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది. ప్రతిదానికి ఒక కోడ్ను క్రియేట్ చేసి డేటా ఎంట్రీ చేసింది. అన్ని అంశాలకు కలిపి దాదాపు 720 కోడ్స్ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బీసీలకు 134 కోడ్స్ క్రియేట్ చేశారు. డేటా ఎంట్రీలో ఎక్కడా తప్పులు జరగకుండా కోడ్స్ సిస్టమ్‌ను అమలు చేసినట్లు పేర్కొన్నారు. మాన్యువల్గా ఎంట్రీ చేయకుండా నేరుగా కోడ్ను సెలెక్ట్, టిక్ చేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
దీంతో హ్యుమన్ ఎర్రర్స్ కూడా చాలా వరకు తగ్గించారు. ఎస్సీ కులాల కోసం 59 కోడ్స్ వినియోగించారు. ఎస్సీల్లో కొన్ని కులాలు ఒకటే అయినప్పటికీ వాటిని ప్రాంతాలను బట్టి వేర్వేరుగా పిలుస్తుంటారు. వాటికి ఒకటే కోడ్ పెట్టారు. ఉదాహరణకు ఎస్సీల్లో చమర్, మోచి, ముచి, చమర్ రవిదాస్, చందర్ రోహిదాస్ అన్నింటిని ఒకటే కోడ్ కింద పరిగణించారు. డక్కల్, డొక్కల్వార్ వంటివి కూడా ఒకటే కోడ్ కిందకు తెచ్చారు.
ఇలా ఎస్సీల్లోనే కాకుండా ఎస్టీ, బీసీ, ఓసీల్లోనూ అమలు చేశారు. ఎస్టీ కులాలకు మొత్తం 32 కోడ్స్ కేటాయించారు. సుగాలీలు, లంబాడీలు, బంజారాలను ఒకే కోడ్ కింద పెట్టారు. యెరుకల, కొరచ, డబ్బా యెరుకల, కుంచపురి, ఉప్పు యెరుకలను ఒక కోడ్ కిందే తీసుకున్నారు. ఇక బీసీ కులాల విషయానికొస్తే మొత్తం 134 కోడ్స్ వినియోగించారు. ఇందులో బీసీ ఏలోని కులాలకు 57, బీసీ బీ కులాలకు 27, బీసీ సీలకు ఒకటే కోడ్, బీసీ డీలకు 35 కోడ్స్, బీసీ ఈలకు 14 కోడ్స్, ఓసీ కులాలకు 19 కోడ్లు కేటాయించారు.