
ఇప్పటికే చేసిన అప్పులు పాలకుల కోసమే
కేంద్రంపై నెపం మోపేందుకే బడ్జెట్కుదింపు
సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్
కేంద్రం ప్రభుత్వంపై నెపం మోపి తప్పించుకోవడానికే సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను కుదించారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ.లక్షా 82 వేల కోట్లతో పెట్టి సాధారణ బడ్జెట్‌ను రూ.లక్షా 42 వేలకు కుదించారన్నారు. దేశ చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో బడ్జెట్‌పైన ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలియాలన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాలు, అప్పుల వడ్డీ, వాయిదాలకే రూ.లక్షా 28 వేల కోట్లు అవసరమన్నారు.
భూములు అమ్మితే వచ్చే ఆదాయాన్ని కూడా కలిపి రాష్ట్ర రెవెన్యూను రూ.లక్షా 13 వేల కోట్లుగా చూపారని విమర్శించారు. రూ.32,900 కోట్లు అప్పు తెచ్చినా ఆస్తుల సృష్టికి మిగిలేది కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమేనన్నారు. సంపద సృష్టి కోసం కాకుండా పాలకుల ప్రయోజనాల కోసమే అప్పులు తెస్తున్నారని, 2023 నాటికి రాష్ట్రం అప్పు రూ.5 లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అప్పు చేస్తే తప్ప ఉద్యోగులకు జీతాలివ్వలేని, స్కీములు కొనసాగించలేని పరిస్థితి ఉందన్నారు. దీనిపై మేధావులు, ప్రజల్లో చర్చ జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్లోని వాస్తవాలపై జిల్లా కేంద్రాల్లో పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.