గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ లీడర్లు

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ లీడర్లు
  •     బీజేపీ తరఫున లక్ష్మణ్, పొంగులేటి, మహిళా మోర్చా నేతల క్యాంపెయిన్ 
  •     కాంగ్రెస్ తరఫున సంపత్, కుసుమకుమార్ ప్రచారం 
  •     పోటీపై మొదట్లో బీఆర్ఎస్ హడావుడి.. ఇప్పుడు అంతా గప్ చుప్

హైదరాబాద్, వెలుగు: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున తెలంగాణ లీడర్లు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ 5న జరగనుండటంతో తెలంగాణ నుంచి వెళ్లిన నేతలు పలు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ఒక దశ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రెండో దశ ప్రచారం కో సం మళ్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ తమిళనాడు కో ఇన్​చార్జ్​, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా నాలుగు రోజులుగా తెలుగు, తమిళులు ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అహ్మదాబాద్, భావ్ నగర్, జామ్ నగర్, సూరత్ జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పొంగులేటి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో గత పది రోజులుగా పలువురు మహిళా మోర్చా కార్యకర్తలు తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం సాగిస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, పలువురు కార్యకర్తలు గుజరాత్​లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కుసుమ కుమార్ అహ్మదాబాద్ వెస్ట్ నియోజకవర్గానికి ఇన్​చార్జ్​గా వ్యవహరిస్తుండగా, సంపత్ కుమార్ తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల సెకండ్ క్యాడర్ అక్కడి ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్రానికి చెందిన పీసీసీ ము ఖ్య నేతలు పలువురు రాహుల్ జోడో యాత్రలో ఉండడంతో గుజరాత్ ప్రచారానికి దూరం గా ఉన్నారు. 

బీజేపీ ఈజీగా గెలుస్తది: ఎంపీ లక్ష్మణ్ 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈజీగా గెలిచి, తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఎన్నికల పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 99 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు కనీసం125 సీట్లలో గెలుస్తుందన్నారు. శనివారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. మొదటి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించానని, అక్కడి ప్రజలు మోడీ నాయకత్వం పట్ల బలమైన విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.

బీఆర్ఎస్.. గప్ చుప్  

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నామంటూ ప్రకటించిన కేసీఆర్.. మొదటిసారి గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. గుజరాత్​లో పోటీపై టీఆర్ఎస్ నేతలు కూడా మొదట బాగానే హడావుడి చేశారు. కానీ ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉండిపోయింది. దీంతో ఈ అంశంపై టీఆర్ఎస్ నేతలు ఎవరూ పెదవివిప్పడంలేదు. గుజరాత్​లో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ బరిలోకి దింపుతారని భావిం చినా.. ఆయన సైలెంట్ గానే ఉండిపోవడం రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలకు 
తెరతీసింది.