కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై చర్చ

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై చర్చ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్​లో ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీలు వివేక్  వెంకటస్వామి, జితేందర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళిని షా అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసినందున ప్రచారం స్పీడప్ చేయాలని, కేంద్ర, రాష్ర్ట పథకాలను ఓటర్లకు వివరించాలని సూచించారు. కాగా, బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ నేతలను పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా నియమించిన విషయం తెలిసిందే. కుష్టగి నియోజకవర్గ బాధ్యతలను వివేక్ వెంకటస్వామికి అప్పగించగా.. ఆయన అక్కడ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. కాంగ్రెస్  పార్టీ నుంచి బీజేపీలో యువకులు, అడ్వొకేట్లు, ఇతర వర్గాల వారు వివేక్  అధ్యక్షతన బీజేపీలో చేరుతున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ మోర్చా నేతలను, యువకులను కలుస్తూ బీజేపీ అభ్యర్థి దొడ్డనగౌడ హనుమగౌడ పాటిల్​కు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఇతర నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్  కూడా త్వరలో ప్రచారంలో పాల్గొనేందుకు  రెడీ అవుతున్నారు.