ఎన్నికల తర్వాత అలా అలా చుట్టొచ్చారు…

ఎన్నికల తర్వాత అలా అలా చుట్టొచ్చారు…

రాష్ట్రంలో లోక్​సభ ఎలక్షన్లు తొలివిడతలోనే జరిగాయి. అప్పటి నుంచి దాదాపు 40 రోజులుగా క్యాండిడేట్లంతా రిజల్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. చాలా మంది క్యాండిడేట్లు లోక్‌‌సభ పోలింగ్‌‌ ముగిసిన వెంటనే వచ్చిన జిల్లా, మండల పరిషత్‌‌ ఎన్నికల పనిలో పడ్డారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు మాత్రం ఇతర పనులు, పర్యటనలు, పార్టీ వ్యవహారాల్లో మునిగిపోయారు. టీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్లలో కరీంనగర్‌‌ ఎంపీ వినోద్‌‌కుమార్‌‌ సీఎం కేసీఆర్‌‌ వెంట ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ టూర్లలో కీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్‌‌ క్యాండిడేట్‌‌ తలసాని సాయికిరణ్‌‌యాదవ్‌‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్‌‌ అభ్యర్థుల్లో మధుయాష్కీ అమెరికాకు వెళ్లారు. మరి ఆయా క్యాండిడేట్లంతా ఈ 40 రోజులుగా ఎలా గడిపారన్న దానిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. దీనిపై ఆ నేతలు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే..

ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌పై ఫోకస్‌‌

కరీంనగర్‌‌ ఎంపీగా నా నియోజకవర్గం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పనిలో ఉంటూనే… ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ఏర్పాటు కోసం సీఎం వెంట కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించాను. రిజల్ట్స్​ తర్వాత సీఎం ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయి.

– వినోద్‌‌, కరీంనగర్‌‌ (టీఆర్​ఎస్)

పోలింగ్‌‌ తర్వాత చిన్న వెకేషన్‌‌

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం, పార్టీ క్యాండిడేట్ల గెలుపు కోసమే ఎక్కువ టైం పెట్టిన. స్థానిక పోలింగ్‌‌ తర్వాత కాస్త గ్యాప్‌‌ దొరికింది. రాష్ట్రం దాటి చిన్న ట్రిప్‌‌ పొయిన.

– రేవంత్‌‌రెడ్డి, మల్కాజిగిరి (కాంగ్రెస్‌‌)

మూడు దేశాల్లో పర్యటించా

మొదటిసారి ఎంపీగా పోటీ చేశా.. రిజల్ట్స్‌‌ కోసం ఈగర్‌‌గా వెయిట్‌‌ చేస్తున్న. పోలింగ్‌‌ తర్వాత గ్యాప్‌‌లో నా కొడుకుతో కాలక్షేపం చేశా. నిరంతరం నాయకులు, కేడర్‌‌, యూత్‌‌తో టచ్‌‌లోనే ఉన్న. తర్వాత మకావు, దుబాయ్​ దేశాలకు స్నేహితులతో కలిసి వెళ్లా. అమెరికాలో నా ఫ్రెండ్‌‌ రెస్టారెంట్‌‌ ఓపెన్‌‌ చేస్తే ఆ ఫంక్షన్‌‌కు అటెండ్‌‌ అయ్యా.

– తలసాని సాయికిరణ్ (టీఆర్‌‌ఎస్‌‌)

తీర్థయాత్రలకు పోయొచ్చిన

ఎంపీ పోలింగ్‌‌ ముగిసిననప్పటి నుంచి ఎక్కువ టైం నియోజకవర్గంలో ప్రజల మధ్యే గడిపిన. షిర్డీ, శ్రీశైలం, తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చిన కౌంటింగ్‌‌ ఏర్పాట్లు చూసుకుంటున్నా..

– అంజన్‌‌కుమార్‌‌, సికింద్రాబాద్‌‌