నిజంగా చేతికి పని దొరుకుతున్న దాంట్లోనూ తెలంగాణదే అప్పర్ హ్యాండ్. జాతీయ స్థాయిలో ఉపాధి దొరికిన వారి రేటు 53.1 శాతం ఉంటే, మన దగ్గర ఏకంగా 57.0 శాతం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వంద మంది మహిళల్లో 52 మందికి పైగా (52.4%) పక్కాగా ఏదో ఒక పని చేస్తూ సంపాదిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న వారిలో అత్యధికంగా 41.5 శాతం మందికి వ్యవసాయం, అనుబంధ రంగాలు అన్నం పెడుతున్నాయి.
ఆ తర్వాతి స్థానంలో 36.3 శాతంతో సర్వీస్ రంగం ఉద్యోగాలు కల్పిస్తోంది. అయితే, రాబోయే రెండు దశాబ్దాల కోసం ప్రభుత్వం భారీ వ్యూహరచన చేసింది. 2047 నాటికి 'తెలంగాణ రైజింగ్' లక్ష్యాన్ని చేరుకోవడానికి 'క్యూర్ -ప్యూర్ -రేర్' అనే విజన్‌ను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా 'క్యూర్' కింద హైదరాబాద్‌ను గ్లోబల్ డీప్ టెక్, ఏఐ హబ్‌గా మార్చి అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించనున్నారు. 'ప్యూర్' కింద పట్టణాల చుట్టుపక్కల మాన్యుఫ్యాక్చరింగ్ కారిడార్లను అభివృద్ధి చేసి యువతకు పారిశ్రామిక ఉపాధి కల్పిస్తారు. ఇక 'రేర్' కింద పల్లెల్లో వ్యవసాయం, అటవీ, చేనేత, ఎకో -టూరిజం ద్వారా రైతులు, కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు. ఈ వ్యూహంతో ద్రవ్యోల్బణం లేని, అధిక ఆదాయం కలిగిన సుస్థిర ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని సోషియో ఎకనామిక్ ఔట్లుక్ వెల్లడించింది.
