- ఈ విషయంలో గోదావరి బోర్డు చోద్యం చూస్తున్నదని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల పేరును మార్చి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కడుతున్నదని, వెంటనే ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ని తెలంగాణ కోరింది. ప్రాజెక్టు పేరు మార్చి ఇటీవల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌కు టెండర్లు పిలిచిందని, కానీ, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మాత్రం బనకచర్ల లింక్‌దే ఉన్నదని ఆక్షేపించింది.
ఈ మేరకు తాజాగా గోదావరి బోర్డుకు ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ లేఖ రాశారు. ఈ ప్రాజె క్ట్ వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం.. ఇప్పటికే నీటి కేటాయింపులు జరిగిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు ఈ ప్రాజెక్ట్ శరాఘాతంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఏకపక్షంగా ఇలా ప్రాజెక్టులు కడుతున్నా జీఆర్ఎంబీ మాత్రం చోద్యం చూస్తున్నదని, ఇది ఏ మాత్రం ఆమోదించలేమని మండిపడ్డారు.
2018లో ఏపీ గోదావరి పెన్నా లింక్ చేపట్టేందుకు ప్రయత్నించినా.. గోదావరి బోర్డు పరిగణనలోకి తీసుకోలేదని, 2020లో దానిపై బోర్డు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆ రాష్ట్రం వెనకడుగు వేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత ఇటీవల బనకచర్ల లింక్‌ను తెరపైకి తెచ్చినా సీడబ్ల్యూసీ, గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు పీపీఏ వ్యతిరేకించడంతో వెనకడుగు వేసిందని చెప్పారు. అందుకే ఇప్పుడు నల్లమల సాగర్ లింక్‌ను తెరపైకి తెచ్చిందన్నారు.
