సంగమేశ్వరం  విస్తరణను అడ్డుకోండి..కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

సంగమేశ్వరం  విస్తరణను అడ్డుకోండి..కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ స్కీమ్​ విస్తరణ పనులను అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ ​శివ్​నందన్ ​కుమార్​కు​ గురువారం ఇరిగేషన్​ ఈఎన్సీ మురళీధర్ ​లేఖ రాశారు. తాగు నీటి పనుల పేరుతో 2,913 క్యూసెక్కులు ఎత్తిపోసే ఆరు పంపుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. చెన్నై, రాయలసీమ తాగునీటి అవసరాల పేరిట 59 క్యూసెక్కులు లిఫ్ట్​చేసేలా పనులు చేస్తున్నారని తెలిపారు. ఇందులో వెలుగోడు రిజర్వాయర్​లో 9.5 టీఎంసీలు, సోమశిలలో 17.33 టీఎంసీలు, కండలేరులో 8.4 టీఎంసీలు నిల్వ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వివరించారు. పర్యావరణ అనుమతులు పొందే వరకు ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని 2021, డిసెంబర్​12న ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

చెన్నై తాగు నీటి కోసం 1976–77లో చేసుకున్న ఇంటర్ ​స్టేట్ అగ్రిమెంట్​ ప్రకారం శ్రీశైలం నుంచి రోజుకు 1,500 క్యూసెక్కులు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉందని గుర్తుచేశారు. అయినా.. 11,150 క్యూసెక్కులు తరలించేలా కాల్వ తవ్వారని, తర్వాత దానిని 44 వేల క్యూసెక్కులకు పెంచారని తెలిపారు. ఇప్పుడు 80 వేల క్యూసెక్కులకు పెంచేలా విస్తరణ పనులు చేపట్టారని పేర్కొన్నారు. 2020, మే 5న ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ ​రెగ్యులేటర్, శ్రీశైలం రైట్​మెయిన్​కెనాల్​కు సిమెంట్​ లైనింగ్​ చేసేందుకు అనుమతులిస్తూ జీవో నం.203 జారీ చేసిందని, ఈ పనులకు ఎన్జీటీ అనుమతులు లేకున్నా చేస్తున్నారని తెలిపారు. బోర్డు వెంటనే జోక్యం చేసుకొని ఈ పనులను నిలిపి వేయించాలని ఈఎన్సీ లేఖలో విజ్ఞప్తి చేశారు.