పోటాపోటీగా తెలంగాణ విమోచన, సమైక్యతా వజ్రోత్సవాలు

పోటాపోటీగా తెలంగాణ విమోచన, సమైక్యతా వజ్రోత్సవాలు
  • నేడు పరకాల అమరధామంలో బీజేపీ కార్యక్రమాలు
  • నియోజకవర్గాల్లో ఎవరికివారుగా ఎమ్మెల్యేల సభలు

వరంగల్‍, వెలుగు: సెప్టెంబర్‍ 17ను పురస్కరించుకొని బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం గ్రేటర్‍ వరంగల్​లో విమోచన బైక్​ర్యాలీలు తీశారు. మరోవైపు తెలంగాణ సెక్రటేరియట్‍కు అంబేడ్కర్‍ పేరు పెట్టాలన్న సీఎం కేసీఆర్ ​నిర్ణయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు కేసీఆర్‍ ఫొటోలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించే క్రమంలో జిల్లాల కలెక్టర్లు ర్యాలీలు, సమావేశాలకు సిద్ధమయ్యారు. మొత్తంగా 16, 17, 18 తేదీల్లో పార్టీలు, ప్రభుత్వపరంగా ఎవరికివారుగా కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. 

గ్రేటర్​లో బీజేపీ బైక్‍ ర్యాలీలు

తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ, సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో అధికార టీఆర్‍ఎస్‍ పార్టీలు 16, 17, 18 తేదీల్లో కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నాయి.  ఇందులో భాగంగా బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో గురువారం గ్రేటర్ వరంగల్‍ పరిధిలో పార్టీ శ్రేణులు బైక్‍ ర్యాలీలు నిర్వహించారు. వరంగల్​లో మహిళా మోర్చా అధ్యక్షురాలు బండారి కల్యాణి, హనుమకొండలో కేతిరెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేయిస్తంభాల గుడి నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రావు పద్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లీడర్లు సుధ, సత్యనారాయణ, సరోత్తంరెడ్డి పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు ఖిలాషాపూర్‍ నుంచి పరకాలలోని అమరధామం వరకు పాదయాత్ర చేపట్టగా అది గురువారం గ్రేటర్‍ వరంగల్‍ చేరుకుంది. శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామంలో తెలంగాణ పోరాటయోధులకు నివాళులు అర్పించేలా బీజేపీ లీడర్లు కార్యక్రమాలు ప్లాన్‍ చేశారు. 

ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు బిజీ

సెప్టెంబర్‍ 17 సందర్భంగా సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలనే సీఎం కేసీఆర్‍ ఆదేశంతో పార్టీ పరంగా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఇటు ప్రభుత్వపరంగా కలెక్టర్లు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. సెక్రటేరియట్‍కు అంబేడ్కర్‍ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించడంతో వరంగల్‍ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‍భాస్కర్‍, నన్నపునేని నరేందర్‍ సీఎం కేసీఆర్‍, అంబేడ్కర్‍ ఫొటోలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‍, పెద్ది సుదర్శన్‍రెడ్డి శుక్రవారం నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాలపై అధికారులు, కేడర్‍తో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున జిల్లా కేంద్రాల్లో చేపట్టే కార్యక్రమాలపై వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు నిమగ్నమయ్యారు. హైదరాబాద్‍ ఎన్‍టీఆర్‍ స్టేడియంలో శనివారం నిర్వహించే సీఎం కేసీఆర్‍ సభకు జిల్లాల నుంచి జనాన్ని తరలించేలా కలెక్టర్లు డాక్టర్‍ గోపి, రాజీవ్‍గాంధీ హనుమంతు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. 

జనగామలో.. 

జనగామ అర్బన్, వెలుగు: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జనగామలో బైక్​ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు గాడిపల్లి ప్రేమలతా రెడ్డి, మహిళా మోర్చా జనగామ జిల్లా ఇన్​చార్జి రాణి , మున్సిపల్ కౌన్సిలర్ 
ఉడుగుల శ్రీలత, మహిళా మోర్చా నాయకురాలు నీరజ సంధ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేశ్ ​పాల్గొన్నారు.