మహ్మదాపూర్​లో స్మృతి కేంద్రాలు ఏర్పాటు చేస్తం

మహ్మదాపూర్​లో స్మృతి కేంద్రాలు ఏర్పాటు చేస్తం

కోహెడ (హుస్నాబాద్​) వెలుగు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హుజూరాబాద్​ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ అన్నారు. మహ్మదాపూర్ కు ప్రత్యేక గుర్తింపు,చరిత్ర ఉందని, గుట్టల్లో ఉన్న అమరుల ఘాటు వద్ద స్మృతి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హుస్నాబాద్​ మండలం మహ్మదాపూర్​ గుట్టల్లో అమరులైన వీరులకు శుక్రవారం ఆయన నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోలేని జాతి తెలంగాణ అని సీఎం కేసీఆర్​ నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక సభల్లో చెప్పారని, అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ఈటల ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అమరుల త్యాగాలు, వారి ఆశయాలను నేరవేరుస్తామని పేర్కొన్నారు.

సాయుధ పోరాట చరిత్రను, వీరుల స్పూర్తిని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను మూడు తోకలంటూ సీఎం కేసీఆర్ అవమానించారు. కేంద్రంలో రెండు సీట్లున్న బీజేపీ 300 సీట్లతో అధికారంలోకి వచ్చిన సంగతిని  కేసీఆర్ గుర్తుంచుకోవాలి. అసెంబ్లీలో నా ముఖం చూడొద్దని కేసీఆర్​ సభ నుంచి నన్ను బయటకు పంపించడాన్ని ప్రజలు అసహ్యంచుకుంటున్నరు. కేసీఆర్ దుర్మార్గాలను, అరాచకాలను ఎండగడతం. టీఆర్​ఎస్​ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. మేం అధికారంలోకి వస్తే, అమరవీరుల త్యాగాల సాక్షిగా ప్రజలు మెచ్చేలా పనిచేస్తం” అని ఈటల చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, వివిధ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.