- టెండర్ల తేదీ పొడిగింపుపై హైకోర్టులో తీర్పు రిజర్వ్
- గడువు పెంపుపై ఐదుగురు వ్యాపారుల పిటిషన్
- ఇరు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం
- తీర్పు రిజర్వ్.. తుది తీర్పు పాటించాలని ఆదేశం
హైదరాబాద్: మద్యం టెండర్ల దాఖలుకు తేదీల పొడిగింపుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎల్లుండి యథావిధిగా లక్కీ డ్రా తీసుకోవచ్చని చెబుతూనే తుది తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారని పేర్కొంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 18వ తేదీ వరకు ఉన్న మద్యం టెండర్ల గడువును 23 వరకు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాదాలు హైకోర్టుకు తెలిపారు. 23వ తేదీకి పెంచడం వల్ల ఐదువేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయని వివరించారు. ఇది తెలంగాణ ప్రోహిబిషన్ ఎక్స్సైజ్ యాక్ట్ నిబంధనల కు విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 12 (5) ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు.
ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రాను కూడా 27వ తేదీకి పొడిగించారని తెలిపారు. దీనిపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. గడువు పెంచడం అనేది తెలంగాణ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని తెలిపారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎల్లుండి లక్కీ డ్రా నిర్వహించవచ్చని, మద్యం దుకాణాల కేటాయింపు తుది తీర్పు లోబడే ఉండాలని సూచించింది.
