
- ఎన్నికలు ఎప్పుడనేది రెండు వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఈ నెల 17న తెలిపిన ప్రభుత్వం
- నవంబర్ 1 లోగా హైకోర్టుకు అఫిడవిట్
- మళ్లీ షెడ్యూల్ జారీ చేయనున్న ఈసీ
- నవంబర్ 3,4 వారాల్లో పోలింగ్?
- బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గంలో చర్చ!!
హైదరాబాద్: సర్కారు స్థానిక ఎన్నికలకు సిద్దమవుతోంది. వచ్చే నెలలో మళ్లీ షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఇందుకోసం రేపు కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. గత నెల 17న స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారించింది. ఈ సందర్బంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించగా రెండు వారాల్లో చెబుతామని ఏజీ ధర్మాసనానికి తెలిపారు. నవంబర్ 1 లోగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం కోర్టుకు తెలపాల్సి ఉంది. ఈ మేరకు అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి కూడా ఉంది.
ఈ క్రమంలో రేపటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఈసీ జారీ చేసిన షెడ్యూల్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం అని ఉంది. ఇందులో జీవో నంబర్ 9 పై హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త షెడ్యూల్ లో బీసీ రిజర్వేషన్లు పాత పద్ధతి ప్రకారం వెళ్లాల్సి వస్తే ఏం చేద్దాం..? అనే అంశంపైనే ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించని పక్షంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోనున్నాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందనే వాదన కూడా బలంగానే ఉంది.
ఒక వేళ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే.. పార్టీ పరంగా 42% సీట్లను బీసీలకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ 42% సీట్లను బీసీలకు కేటాయిస్తే మిగతా పార్టీలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం సర్వశక్తులు ఒడ్డామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించలేదని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా భారీగా స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదే క్రమంలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లలో బీఆర్ఎస్ ఇంప్లీడ్ కాలేదని, బీసీల పట్ల ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పే చాన్స్ ఉంది. ఇటీవల బీసీ బంద్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీఫ్ లు పాల్గొనలేదని, బీసీలకు మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పుకొనే స్కోప్ కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించాలనే దృష్టితోనే ప్రభుత్వం ముందుకెళ్తోందని సమాచారం.