అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : దామోదర రాజనర్సింహా

అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : దామోదర రాజనర్సింహా

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో అర్హులందరికీ కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలోని అమీన్​పూర్, తెల్లాపూర్​ మున్సిపాలిటీల పరిధిలోని పలు వార్డులు, పటాన్​చెరు మండలం పోచారంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. పలువురు లబ్ధిదారుల నుంచి నేరుగా అప్లికేషన్లను స్వీకరించారు. మహాలక్ష్మి, రూ. 500 కే గ్యాస్​ సిలిండర్​, చేయూత పెన్షన్లు, రైతు భరోసా, పేదలకు ఇళ్లు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. 

పాలనా దక్షత ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్​ అని తెలంగాణ సమాజానికి, అభివృద్ధికి కాంగ్రెస్​ మాత్రమే దిక్సూచని వాఖ్యానించారు. ఆయా దరఖాస్తు కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడారు. పోచారం గ్రామానికి బస్సు సౌకర్యం, గ్రామంలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సర్పంచ్​ జగన్ మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ శరత్​, మున్సిపల్​ చైర్మన్లు పాండురంగా రెడ్డి, లలితా సోమిరెడ్డి, కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్‌‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్​, జిల్లా మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.