మమ్మల్ని తీసుకెళ్లండి.. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ కూలీల గోస

మమ్మల్ని తీసుకెళ్లండి.. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ కూలీల గోస

హైదరాబాద్, వెలుగు:  బతుకుదెరువు కోసం, చదువు కోసం, టూర్లకు పోయినోళ్లు.. మొత్తంగా 2 లక్షల మంది… మన రాష్ట్రం నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్లి, లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయారు. వెనక్కి వచ్చే మార్గం లేక.. ఉన్నచోట తిండి దొరకక మన వలస కూలీలు, స్టూడెంట్స్, టూరిస్టులు నానా కష్టాలు పడుతున్నారు. కేంద్రం ప్రకటించిన సడలింపుతో కొంత ఊరట లభించడంతో, సొంత రాష్ట్రానికి పంపాలని అక్కడి అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వమే వీరిని వెనక్కి రప్పించడంపై నిర్ణయం తీసుకోకుండా ఊగిసలాడుతోంది. తెలంగాణకు చెందినోళ్లు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఎక్కువ మంది ఉన్నట్టు ఆ రాష్ట్రాల అధికారులు మన ప్రభుత్వానికి వివరాలు పంపినట్టు తెలిసింది. మన నోడల్ ఆఫీసర్లను ఆయా రాష్ట్రాల కలెక్టర్లు సంప్రదిస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.

వెంటాడుతున్న ముంబై భయం

తెలంగాణ సర్కారును మహారాష్ట్ర భయం వెంటాడు తోంది. ముంబైలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ చిక్కుకున్న మనోళ్లను ఎలా రప్పించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ‘‘అక్కడ్నించి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేయాలా? ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించాలా? స్పష్టత రాలేదు’’ అని ఓ అధికారి తెలిపారు. .

రాజస్థాన్ లో వేలాది స్టూడెంట్స్ 

రాజస్థాన్ లోని కోటా లో ఐఐటీ కోచింగ్ కోసం వెళ్లిన తెలంగాణ స్టూడెంట్స్  వేలాది మంది చిక్కుకున్నారు. వారంతా వెనక్కి వెళ్లిపోతామంటూ స్థానిక అధికారులను కోరుతున్నారు. ఏపీ స్టూడెంట్స్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 70 బస్సులను ఏర్పాటు చేసింది. తీర్థ యాత్రలకు వెళ్లిన కొందరు మహారాష్ట్ర, తమిళనాడు, వారణాసిలో చిక్కుకున్నట్టు ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్టు తెలిసింది.

కూలీలు ఎవరికి చెప్పుకోవాలి?

ఇతర రాష్ట్రాల వలస కూలీలను వెనక్కి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసిన మెమో 2195లో  స్పష్టత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని తెలంగాణ వాసులు ఎవరిని సంప్రదించాలనే విషయంపై క్లారిటీ లేదని చెప్తున్నారు.

బస్సులు ఏర్పాటుచేయండి సార్.. 

‘ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని తొర్రూరు, జనగామ, తిరుమలగిరి, నల్లగొండ, మోత్కూరుకు చెందిన వలస కూలీలం బతుకుదెరువుకు ముంబైకి వచ్చాం. ఇక్కడ అంటాప్ హిల్, సియాన్​కోలివాడ, వడాల, ధారావి స్లమ్స్​లో ఉంటున్నాం. తెలంగాణ సర్కారు స్పందించి మమ్మల్ని తీసుకెళ్లాలి.  సొంత ఖర్చులు పెట్టుకుని రావడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ముంబై స్లమ్‌లో చిక్కుకున్న కూలీలు చెబుతున్నారు.