
- కేంద్రం సాయం చేస్తలే
- అత్యధిక ఆదాయమిస్తున్నా తెలంగాణపై వివక్ష: మంత్రి కేటీఆర్
- ఈ బడ్జెట్‌లో నిధులివ్వకుంటే కేంద్రంతో పోరాడుతం
- రాష్ట్రంలో డ్రిల్‌మాక్ రూ.1,500 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న నాలుగో రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రాజకీయ కారణాలతోనే తమ రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులివ్వకుంటే కేంద్ర ప్రభుత్వంపై ఉద్యస్తామని హెచ్చరించారు. ప్రధాని మోడీ తెలంగాణ, ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రముఖ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డ్రిల్‌మాక్‌తో రాష్ట్ర పరిశ్రమల శాఖ రూ.1,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూ చేసుకుంది. మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థతో కలిసి డ్రిల్‌మాక్ ఇక్కడ తన యూనిట్ స్థాపించనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని చెప్పడమే తప్ప బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు కేంద్రం తోడ్పాడు అందించడం లేదన్నారు. అభివృద్ధిలో పురోగమిస్తున్న తమ రాష్ట్రానికి కేంద్ర సహకారం ఎంతో అవసరమని, బడ్జెట్‌లో అనుకున్న సహకారం అందకపోతే ఉద్యమించక తప్పదన్నారు.
కేసీఆర్ నాయకత్వం వల్లే..
అమెరికా, ఇటలీ, బెలారస్ తర్వాత ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు డ్రిల్‌మాక్ ముందుకు వచ్చిందని కేటీఆర్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ సంస్థకు ఆహ్వానాలు అందినా, తెలంగాణ వైపు మొగ్గు చూపిందన్నారు. ఆయిల్ రిగ్గులు తయారు చేసే ఈ సంస్థ.. తెలంగాణకు సముద్ర తీరం లేకున్నా, ఆయిల్, గ్యాస్ రీసోర్సులు లేకున్నా, ఇక్కడే తమ యూనిట్ స్థాపించేందుకు ముందుకు రావడానికి కేసీఆర్ సమర్థ నాయకత్వమే కారణమన్నారు. ఈ సంస్థ రీసెర్చ్ సెంటర్, యూనిట్‌తో 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇందులో 90 శాతం ఉద్యోగాలు ఈ రాష్ట్ర యువతకు దక్కుతాయన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ ఇండస్ట్రీని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ శివారులో ఫార్మాసిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 6 కొత్త ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు పలుమార్లు కేంద్రాన్ని అడిగినా స్పందన లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్రిల్‌మాక్ సీఈవో సిమోనీ ట్రెవిసని, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, డ్రిల్‌మాక్ ఇంటర్నేషనల్ సీఈవో ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ రోడ్ల విస్తరణకు రూ.84 కోట్లు
నల్గొండ పట్టణంలో రోడ్ల వెడల్పు, అభివృద్ధికి రూ.84 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నీలగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా)లో చేపట్టాల్సిన పనులపై సోమవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్షించారు. రోడ్ల విస్తరణకు రూ.84 కోట్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని తప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గంలోని మంగళపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు గ్రామాలను కలుపుతూ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. నగరంలో రోడ్లు, తాగునీరు, కరెంట్ సరఫరా, గ్రీనరీ, ఉదయ సముద్రం బ్యూటిఫికేషన్ పై చర్చించారు. నల్గొండలో ఏడాదిలోపు చేపట్టే పనుల లిస్ట్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు.