నిఘా భయమేనా?.. మినిస్టర్స్​ క్వార్టర్స్ లో ఉండేందుకు ఇష్టపడని మంత్రులు

నిఘా భయమేనా?.. మినిస్టర్స్​ క్వార్టర్స్ లో ఉండేందుకు ఇష్టపడని మంత్రులు

బాబోయ్​.. మినిస్టర్స్​ క్వార్టర్స్!

అక్కడ ఉండేందుకు ఇష్టపడని మంత్రులు.. నిఘా భయమే కారణం?

సకల సౌకర్యాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన  మినిస్టర్స్​ క్వార్టర్స్​లో ఉండేందుకు రాష్ట్ర మంత్రులు పెద్దగా ఇంట్రస్ట్​ చూపడం లేదు. విశాలమైన మైదానం, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సౌలతులు ఆ క్వార్టర్స్​లో ఉంటాయి. భద్రత కోసం 24 గంటలపాటు సెక్యూరిటీ ఉంటుంది. అదే సమయంలో ఎవరెవరూ వస్తున్నారని తెలుసుకునేందుకు నిఘా సైతం ఉంటుంది. ఈ నిఘా కారణంగానే కొందరు మంత్రులు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉండేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. హైదరాబాద్​ బంజారాహిల్స్​ రోడ్డు నంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్  ఉన్నాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి వచ్చే విజిటర్స్ వివరాలను అక్కడి సిబ్బంది తీసుకున్నాకే లోపలికి అనుమతిస్తారు. మంత్రుల వద్దకు పార్టీ నేతలు, బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే సన్నిహితులు వచ్చి వెళ్తుంటారు. వారి వివరాలను అక్కడి ఇంటెలిజెన్స్​ సిబ్బంది సేకరించి పైఅధికారులకు పంపుతుంటారు. ఇది కొంత మంది మినిస్టర్స్​కు ఇబ్బందిగా మారింది. దీంతో సొంతింట్లోనే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంకొందరు మంత్రులు.. క్వార్టర్స్​ను క్యాంప్​ ఆఫీసులుగా వాడుకుంటున్నారు.

అన్నీ ఆరా తీస్తారని..!

గత ప్రభుత్వంలో మినిస్టర్స్​ క్వార్టర్స్​లోని నిఘా వర్గాలు చేసిన కొన్ని పనులు మంత్రులకు చికాకు తెప్పించాయని టీఆర్ఎస్ లోని ఓ సీనియర్ నాయకుడు అన్నారు. మంత్రుల వద్దకు ఎవరెవరు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఎంతసేపు ఉంటున్నారు.. తదితర పూర్తి వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తుంటాయని, దీంతో అప్పట్లో మినిస్టర్స్​ క్వార్టర్స్​లో ఉండే ఓ మంత్రి వద్దకు వెళ్లేందుకు నాయకులు భయపడి, మినిస్టర్స్ క్వార్టర్స్  ముఖం చూడటం మానేశారని గుర్తుచేశారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు.. మరోవైపు క్వార్టర్స్ వద్ద వేగులు ఉండటంతో క్వార్టర్స్​ కంటే బయట ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి సదరు మంత్రి వచ్చారని  తెలిపారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మంత్రుల్లో కొందరు ఇప్పటికీ క్వార్టర్స్ కు వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియెట్​కు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే మినిస్టర్స్​ క్వార్టర్స్​ ఉన్నా.. వాటిల్లో ఉండేందుకు వారు ఇష్టపడటం లేదు. తమ సొంతిల్లు సెక్రటేరియెట్​కు సుమారు 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అక్కడి నుంచే వచ్చేందుకు ఇష్టపడుతున్నారు.

ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మినిస్టర్స్ క్వార్టర్స్​లో భవనం కేటాయించినా ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఉండేందుకే  ఆయన ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఉండటం అలవాటైందని, మినిస్టర్స్​ క్వార్టర్స్​కు వెళ్తే అడ్జస్ట్​ అవుతామో లేదోననే ఫీలింగ్​లో ఆయన ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు.

బొటానికల్ గార్డెన్ దగ్గరలో ఇంద్రకరణ్

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొదటి నుంచీ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉండటంలేదు. బొటానికల్ గార్డెన్ దగ్గర నిర్మించుకున్న పాష్ విల్లాలోనే ఆయన ఉంటున్నారు.

కొప్పుల, జగదీశ్ మాత్రం అక్కడే

మంత్రి కొప్పుల ఈశ్వర్, జగదీశ్ రెడ్డి మాత్రం మినిస్టర్స్ క్వార్టర్స్ లోనే ఉంటున్నారు. గత ప్రభుత్వంలో కొప్పుల చీఫ్ విప్ గా, జగదీశ్ మంత్రిగా ఉండేవారు. తాజా ప్రభుత్వంలో ఇద్దరూ మంత్రులు కావడంతో అదే క్వార్టర్స్ లో బస చేస్తున్నారు. కొత్తగా
మంత్రులైన పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్​కు ఇంకా మినిస్టర్స్​ క్వార్టర్స్ కేటాయించలేదు.

కిరాయి ఇంట్లో హరీశ్​

ఫస్ట్​ టర్మ్​లో మంత్రిగా చేసినప్పుడు హరీశ్​రావు మినిస్టర్స్ క్వార్టర్స్​లో ఉండేవారు. రెండోసారి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఫిబ్రవరిలో మంత్రి మల్లారెడ్డికి మినిస్టర్స్​ క్వార్టర్స్​లోని హరీశ్​ ఇంటిని కేటాయించారు. దీంతో హరీశ్​ కొండాపూర్​లో ఓ అద్దె ఇంట్లోకి షిఫ్ట య్యారు. ఇటీవల మంత్రి అయ్యాక కూడా హరీశ్ అక్కడే ఉంటున్నారు. అక్కడే ఒక పెద్ద ఇల్లు కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

క్యాంపు ఆఫీసులుగా  మినిస్టర్స్ క్వార్టర్స్!

మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉంటున్న కొంత మంది మంత్రులు వాటిని క్యాంప్ అఫీసులుగా ఉపయోగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొత్త సెక్రటేరియెట్​ నిర్మాణం నేపథ్యంలో సెక్రటేరియట్ లో మంత్రుల పేషీలు ఖాళీ అయ్యాయి. వాటిని బీఆర్కే భవన్​లో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ రిపేర్లు కొనసాగుతున్నాయి. దీంతో కొందరు మంత్రులు తమకు మినిస్టర్స్ క్వార్టర్స్ లో కేటాయించిన బిల్డింగ్స్​లో సమీక్షలు చేస్తున్నారు. నియోజక వర్గం నుంచి ఎవరైనా వస్తే అక్కడే కలుస్తున్నారు. సాయంత్రం వరకు ఉండి సొంతిండ్లకు వెళ్లిపోతున్నారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డికి అత్తాపూర్ లో సొంతిండ్లు ఉన్నాయి. మహమూద్ అలీకి  మలక్ పేటలో, మల్లారెడ్డికి బోయిన్​పల్లిలో, వేములు ప్రశాంత్ రెడ్డికి ఖైరతాబాద్ లో సొంతిండ్లు ఉన్నాయి. వీరిలో పలువురు మినిస్టర్స్​ క్వార్టర్స్​ను సమీక్షలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విమర్శలున్నాయి.

ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈటల

గత ప్రభుత్వంలో ఈటల రాజేందర్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉండేవారు. ప్రభుత్వం రద్దయ్యాక శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని సొంతింటికి షిఫ్ట్​ అయ్యారు. రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నారు. నియోజకవర్గానికి వెళ్లేందుకు మంత్రికి శామీర్​పేట చాలా ఈజీగా ఉంటుందని, ఆ ప్రాంతంలో ఉండటం వల్ల మంత్రిని కలిసేందుకు నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలకు కూడా దూరభారం తగ్గుతుందని ఓ నాయకుడు తెలిపారు.

మారేడుపల్లిలో తలసాని

మంత్రి తలసాని మొదటి నుంచీ మారేడుపల్లిలోని సొంతింట్లోనే ఉంటున్నారు. స్థానికులకు అందుబాటులో ఉండాలని ఆయన అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వద్దకు వివిధ వర్గాల వారు నిత్యం వస్తూ పోతూ ఉంటారని, వారికి ఇబ్బంది కలుగవద్దన్న కారణంతో మినిస్టర్స్ క్వార్టర్స్​లో ఉండేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదని టీఆర్​ఎస్​ నాయకుడు ఒకరు తెలిపారు.

శ్రీనగర్ కాలనీలో సబిత

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి  శ్రీనగర్ కాలనీలో సొంతిల్లు ఉంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా సబిత అక్కడే నివాసం ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడే ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మినిస్టర్స్ క్వార్టర్స్ కు మారడం వల్ల  విజిటర్స్ కు కొత్త సమస్యలు రావొచ్చని మంత్రి భావిస్తున్నట్లు సమాచారం.