తెలంగాణ మోడల్​ దేశానికే దిక్సూచీ: కవిత

 తెలంగాణ మోడల్​ దేశానికే దిక్సూచీ: కవిత
  • తక్కువ టైమ్​లో సమగ్ర అభివృద్ధి: కవిత
  • ఆక్స్​ఫర్డ్ వర్సిటీలో ప్రసంగించిన ఎమ్మెల్సీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే దిక్సూచీగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తక్కువ సమయంలో రాష్ట్రం అత్యంత వేగంగా సమగ్ర అభివృద్ధి సాధించిందని తెలిపారు. మంగళవారం ఉదయం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ‘‘ఎక్స్​ప్లోరింగ్​ఇంక్లూజివ్ ​డెవలప్​మెంట్​: ది తెలంగాణ మోడల్” అంశంపై ఆమె మాట్లాడారు. తెలంగాణ ఏర్పడేనాటికి పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు అత్యంత వెనకబడినవని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. 2,700 మెగావాట్ల విద్యుత్ ​కొరత ఉండేదని, పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ ​హాలిడే ఇచ్చారని గుర్తు చేశారు.

తొమ్మిదిన్నరేండ్లలోనే మిగులు విద్యుత్​ ఉన్న రాష్ట్రంగా అవతరించిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానానికి చేరిందన్నారు. పదేండ్లలో దేశ జీడీపీ గ్రోత్​118.2% పెరగ్గా, తెలంగాణ జీఎస్డీపీ 155.7% పెరిగిందని తెలిపారు. 2013–14లో తలసరి ఆదాయం రూ.1.12 లక్షలు ఉంటే 2022 – 23 నాటికి రూ.3.14 లక్షలకు పెరిగిందన్నారు. ధరణితో 99% భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని చెప్పారు. రికార్డు సమయంలోనే కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తి చేశామని, రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2 కోట్ల ఎకరాలకు పెంచామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఇంకో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు.