హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టుకు దరఖాస్తు గడువును మార్చి 2 వరకూ పెంచుతున్నట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు గురువారంతో ముగియగా, పేరెంట్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పెంచినట్టు ఆయన చెప్పారు. కాగా, ఇప్పటి వరకూ 47,768 అప్లికేషన్లు వచ్చాయని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నామని వెల్లడించారు. అలాగే ఏడో తరగతి నుంచి టెన్త్ వరకూ ఆయా స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించనున్నామని వివరించారు. https://telanganams.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు.
