ఖైరతాబాద్, వెలుగు: తమ వేదిక నిధుల వివరాలు వెల్లడించేందుకు తాము సిద్ధమని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నిర్వాహకుడు గాదె ఇన్నయ్య చెప్పారు. కేసీఆర్ ఆస్తులు బయటపెట్టేందుకు ఆయన చెంచాలు సిద్ధమా అని ప్రశ్నించారు. వేదిక మద్దతుదారులతో కలిసి సోమవారం ఆయన హైదరాబాద్గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్నయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తాము లేకుంటే కేసీఆర్ కు రాజకీయ జీవితం ఉండేది కాదన్నారు. ప్రగతిభవన్ డైరెక్షన్లో తమపై ఆరోపణలు చేస్తున్న ద్రోహులు కేసీఆర్ అసలు చరిత్ర ఎంటో తెలుసుకోవాలని సూచించారు. తమకు పదవులు అవసరం లేదని, బందీ అయిన తెలంగాణ కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజల, కేసీఆర్ వ్యతిరేక శక్తుల సాయంతోనే తమ వేదిక నడుస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాపై ఎంత ఫోకస్ పెడితే.. అంతకు రెట్టింపు ఫోకస్‌తో పని చేస్తామని చెప్పారు. మా వేదిక వెనుక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు.
వాసాలమర్రి సభకు ఎంత ఖర్చయ్యిందో? ఆ డబ్బు ఎక్కడిదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ వద్ద ఉండే పోలీస్ సిబ్బందికి అయ్యే ఖర్చుతో అమర వీరుల కుటుంబాలకు జీవితాంతం సరిపోయే సాయం చేయొచ్చన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. నాడు తాము పెట్టిన ఐక్య కార్యాచరణ కమిటీలో ప్రస్తుతం టీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలు ఉన్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లు అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్శత్రువులే మమ్మల్ని నడిపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కారుడు విఠల్ మాట్లాడుతూ తెలంగాణ తల్లిని బతికి ఉండగానే బొంద పెట్టావని సీఎంపై ఫైర్అయ్యారు. అసలైన ఉద్యమకారులను విమర్శిస్తే టీఆర్ఎస్ను బొంద పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నం చిన్ని వెంకటేశ్వరరావు, దయ్యాల శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.
