- తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు
- బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో తుదిశ్వాస
- యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన జిట్టా
- సంతాపం తెలిపిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు
హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి కన్ను మూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బారిన పడి.. నెల రోజులుగా సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ఇక ఆయన కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలపడంతో.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు భువనగిరిలోని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, మార్గ మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పంథాతో క్రియాశీలకంగా పనిచేశారు.యువజన సంఘాల నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి.. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. తొలుత బీఆర్‌ఎస్‌లో పనిచేసి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. స్వరాష్ట్ర ఆవిర్భావానికి ముందే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి యువ తెలంగాణ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీ నుంచే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీలో, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ బీఆర్‌ఎస్ లో చేరారు.
యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా..
జిట్టా బాలకృష్ణారెడ్డి 1972 డిసెంబర్ 14 యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో రాధమ్మ, బాల్‌రెడ్డి దంపతులకు జన్మించారు. యువజన సంఘాల సమితితో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేసి.. 2003లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ యువజన విభాగం స్టేట్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అయితే, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్చీఫ్ కేసీఆర్అనూహ్యంగా జిట్టాకు టికెట్ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి ఉమా మాధవ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత బీఆర్ఎస్కు రిజైన్‌చేసి కాంగ్రెస్‌లో చేరారు. కానీ, తెలంగాణ ప్రకటనపై ఆ పార్టీ వెనక్కి తగ్గడంతో రాజీనామా చేసి.. 2018 సెప్టెంబరు 5న యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. 2014 ఎన్నికల్లో యువ తెలంగాణ అభ్యర్థిగా పోటీ చేసి పైళ్ల శేఖర్‌రెడ్డి చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ మద్దతిచ్చినా.. ఓటమి తప్పలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 16న రాణి రుద్రమతో కలిసి బీజేపీలో చేరిన బాలకృష్ణారెడ్డి.. తన యువ తెలంగాణ పార్టీని అందులో విలీనం చేశారు. ఆ తర్వాత తన సేవలను పార్టీ ఉపయోగించుకోవడం లేదన్న ఉద్దేశంతో ఆయన బీజేపీకి దూరంగా ఉండగా.. పార్టీ నుంచి జిట్టా సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో 2023 సెప్టెంబర్ 16న జిట్టా కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ 20న కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరి, అందులో కొనసాగుతున్నారు.
సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జిట్టా అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని రేవంత్పేర్కొన్నారు. ‘‘మిత్రుడు, సన్నిహితుడు బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్ర్భాంతిని కలిగించింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రపోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని సీఎం పేర్కొన్నారు.
అలాగే, మాజీ సీఎం, బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా క్రియాశీలకంగా పాల్గొన్నారని, ఆయన మరణం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి హరీశ్‌రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు సంతాపం తెలిపారు.